హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానల్లో ఖాళీగా ఉన్న 1,569 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను భర్తీచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మున్సిపాలిటీల్లో 349 పోస్టులు, గ్రామీణ ప్రాంతాల్లో 1,220 పోస్టులు ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లాలవారీగా భర్తీచేయనున్నారు. కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. నియామక ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఎంబీబీఎస్‌తోపాటు యునానీ, హోమియోపతి, నేచురోపతి అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. నియామక ప్రక్రియ మార్గదర్శకాలను ప్రభుత్వం గత నెలలోనే విడుదలచేసింది.
నియామక విధివిధానాలు ఇలా..
పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేసేందుకు ఎంబీబీఎస్ లేదా బీఎంఎస్ పూర్తి చేసినవారే అర్హులు. ఇందులో ఎంబీబీఎస్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్, బీఏఎంఎస్‌తోపాటు స్టాఫ్ నర్స్‌లు సైతం అర్హులు. స్టాఫ్నర్స్ల్లో 2020 తర్వాత బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసినవారు, 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తిచేసి ఆరు నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్టు (సీపీసీహెచ్) పూర్తి చేసినవారు అర్హులు.
డాక్టర్లకు రూ.40 వేలు, స్టాఫ్ నర్స్‌కు రూ.29,900 గౌరవ వేతనం అందిస్తారు.
ఈ పోస్టులకు కనీస వయసు 18 ఏండ్లు, గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్ల వయోపరిమితిలో సడలింపు ఇచ్చే అవకాశం.
మెరిట్ ఆధారంగా పోస్టింగ్ ఆప్షన్లు ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రెండువారాలు శిక్షణ ఇస్తారు.
ఈ నెలాఖరులోగా లేదా.. అక్టోబర్ మొదటివారంలోగా నియామకాలు పూర్తిచేస్తారు.