హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు, ఫీజుల భారం మోపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. వాటి అమలుకు ఆపసోపాలు పడుతున్నది. ఇప్పుడు వాటి అమలుకు ప్రజలను పన్నులతో బాధపెట్టే చర్యలకు పాల్పడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ శాఖల ద్వారా, భూముల అమ్మకాల ద్వారా అదనంగా సుమారు రూ.12,000-15,000 కోట్లు రాబట్టడం లక్ష్యంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు మంతనాలు, సమీక్షలు జరుపుతున్నారు. ఇందులో కేవలం పన్నుల పెంపు ద్వారానే రూ.ఆరేడు వేల కోట్లు రాబట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవన్నీ 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో కనీసం ప్రస్తావించని అంశాలే కావడం గమనార్హం. ప్రభుత్వ చర్యలు ప్రజల జేబులపై భారీ భారం మోపుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే హౌసింగ్ బోర్డు భూములు, హెచ్ఎండీఏ భూముల అమ్మకాల ద్వారా నిధులు సమీకరిస్తున్న ప్రభుత్వం.. తాజాగా మోటరు వాహనాల లైఫ్‌ట్యాక్స్‌ను పెంచింది. దీంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వాహనాలు కొనుగోలు చేయాలంటే ఇక మరింత భారమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఓఆర్ఆర్ బయట, లోపల భూముల విలువను సవరించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది. ఈ సవరణ ద్వారా కనీసం రూ.2,000 కోట్లు అదనంగా ఖజానాకు సమకూర్చకోవాలని చూస్తున్నది.
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) బయట, లోపల భూముల విలువలను సవరించడంతోపాటు లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) రాయితీల ద్వారా ప్రభుత్వం ఖజానాకు నిధులు రాబట్టుకుంటున్నది. ఓఆర్ఆర్ బయట, లోపల స్థిరాస్తుల మార్కెట్ విలువ సవరణ కోసం తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు మార్గదర్శకాలు జారీచేసింది. ఈ శాఖకు వచ్చే ఆదాయంలో దాదాపు 60% వరకు ఓఆర్ఆర్ లోపల, బయటి ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచే వస్తున్నది. ఈ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను సవరించడం ద్వారా రూ.2,000 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2025లో భూమి మారెట్ వాల్యూ 20-60% పెరిగింది, దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా భారీగా పెరిగాయి. ఎల్ఆర్ఎస్ కింద 25% రాయితీ ఇచ్చినప్పటికీ మొత్తం మీద భూమి యజమానులు, కొనుగోలుదారులు అదనపు భారం మోయాల్సి వస్తున్నది. ఇది రియల్ఎస్టేట్ మారెట్ను ప్రభావితం చేసి, సామాన్యులకు భూమి కొనుగోలు కష్టతరం కానున్నది.
వాహనాల లైఫ్‌ట్యాక్స్ పెంపు ద్వారా కనీసం రూ.2,500 కోట్లు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. గతంలో రూ.2 లక్షల పైచిలుకు విలువ గల వాహనాలకు లైఫ్‌ట్యాక్స్ 12% ఉండగా, దానిని ఇప్పుడు 18 శాతానికి పెంచింది. రూ.లక్ష విలువైన వాహన లైఫ్‌ట్యాక్స్‌ను 12% నుంచి 15 శాతానికి పెంచింది. పాత ట్యాక్స్‌ల ద్వారా ఏడాదికి రూ.4,401 కోట్లు వస్తుండగా, ఇప్పుడు అదనంగా మరో రూ.2,500 కోట్లు రానున్నాయి. అన్నీ కలిపి ఇప్పుడు సుమారు రూ.7,000 కోట్ల నిధులను సమకూర్చుకోనున్నది. గతంలో వాహన ట్యాక్స్‌లు పెంచబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి దానిని తుంగలో తొక్కారు. కేంద్రం కన్నా రాష్ట్రం అధిక పన్నులు విధిస్తున్నది. ఉదాహరణకు రూ.1.1 లక్షల పెట్టి ఓ యువకుడు బైక్ కొంటే, ఇందుకు రేవంత్ సర్కారు పన్ను రూపంలో రూ.16,500 పిండుతున్నది.
ప్రజల రోజువారీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్న చర్యల్లో బస్‌పాస్ చార్జీల పెంపు ఒకటి. పండుగల సమయంలో ఆర్టీసీ ప్రత్యేక చార్జీల బాదుడు ఇందుకు అదనం. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ ఆర్టీసీ) బస్‌పాస్ చార్జీలనులను 20% నుంచి 50% వరకు పెంచింది. ఆర్డినరీ బస్సు పాస్ ధరను నెలకు రూ.1,150 నుంచి రూ.1,400కు, ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ ధరను రూ.1,300 నుంచి రూ.1,600కు పెంచింది. పండుగల వేళల్లో టికెట్ చార్జీల మీద అదనంగా 30% నుంచి 50% వరకు బాదుతున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పండుగల సమయంలో స్పెషల్ బస్సుల అదనపు చార్జీలతో ప్రయాణికులు కంగుతింటున్నారు.
రాష్ర్టానికి వస్తున్న ఆదాయాల్లో మద్యం (ఎక్సైజ్) రాబడి ప్రధానమైనది. మద్యం ఆదాయంలో ఏటా కనీసం 30% పెరుగుదల కనిపిస్తున్నది. 2023-24లో ఎక్సైజ్, వ్యాట్ రెవెన్యూ కలిపి రూ.34,877 కోట్లు వచ్చింది. 2024-25లో రూ.44,196 కోట్లు సమకూరింది. 2025-26లో ఎక్సైజ్ ద్వారా రూ.27,623 కోట్లు, వ్యాట్ ద్వారా రూ.22,570 కోట్లు మొత్తంగా రూ.50,193 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. గతంలో కేసీఆర్ తొలగించిన సెస్‌ను మళ్లీ తీసుకొచ్చారు. క్వార్టర్ బాటిల్‌కు రూ.10 చొప్పున ఫుల్‌బాటిల్‌పై అదనంగా రూ.40 వసూలు చేస్తున్నారు. ఒక్కో బీరు ప్రీమియం బ్రాండ్‌ను బట్టి రూ.20 నుంచి రూ.60 వరకు పెంచారు. కోడిగుడ్ల టెండర్ల ఫీజు పెంపు వంటి చిన్నచిన్న విషయాల్లో కూడా ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇంతకుముందు టెండర్ ఫీజు రూ.5 వేలు ఉండగా, ఇప్పుడు దానిని రూ.25 వేలకు పెంచింది.
విద్యాశాఖ నుంచి కూడా వీలైనంతగా ఫీజులు పిండుకోవాలని చూస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు గతంలో రూ.14,900 ఫీజు ఉంటే దానిని ఇప్పుడు ఏకంగా రూ.39 వేలకు పెంచారు. టెట్ ఫీజులు రూ.400 నుంచి రూ.1,000కి పెంచారు. పోటీ పరీక్షల ఫీజులను భారీగా పెంచడం యువతను నిరాశపరుస్తున్నది. తెలంగాణ ఇంటర్‌బోర్డు ఎగ్జామ్ ఫీజు రూ.510 నుంచి రూ.520కు పెరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లకు నెలవారీ టార్గెట్లు సెట్ చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 2025-26 బడ్జెట్లో రూ.3.05 లక్షల కోట్ల ఆదాయం అంచనా వేశారు. కానీ, ఇది అప్పులు పెంచడం ద్వారా సాధ్యమవుతున్నది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని ప్రతి క్యాబినెట్ సమావేశంలోనూ నిర్ణయిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల హామీలు అమలుచేసేందుకు ఇప్పుడు ప్రజలపై భారం మోపుతున్నది. ప్రభుత్వం ఈ చర్యలు ఆర్థిక స్థిరత్వం కోసమే అని చెప్తున్నప్పటికీ, సామాన్యులు మాత్రం ఈ భారం భరించలేకపోతున్నారు.