హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం సగం ముగిసినా ఆదాయ లక్ష్యాలను సాధించలేకపోయింది. ఇప్పటివరకు బడ్జెట్ ఆదాయ లక్ష్యంలో కేవలం 39.41 శాతమే ఆర్జించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారడంతో ఆదాయ పెంపు మార్గాలను అన్వేషిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇటీవల సమావేశమై పలు ప్రతిపాదనలు చేసింది. రాష్ర్టానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం ధరలను పెంచాలని, ప్రభుత్వ భూములు, రాజీవ్ గృహకల్ప ఫ్లాట్లను అమ్మకానికి పెట్టాలని సూచించింది. కేంద్రం, ఇతర సంస్థల నుంచి బకాయిలు, వన్-టైం సెటిల్మెంట్ సీమ్ కింద బకాయి పన్నులు, జరిమానాలు వసూలు చేయాలని ప్రతిపాదించింది. రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీకి నష్టం జరుగకుండా, ప్రజలపై పన్నుల భారం మోపకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను పరిశీలించాలని ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క క్యాబినెట్ సబ్‌కమిటీకి సూచించినట్టు తెలుస్తున్నది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.2.74 లక్షల కోట్ల ఆదాయ ఆర్జనను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఈ ఆరు నెలలలో రూ.1.08 లక్షల కోట్ల (39.41 శాతం) ఆదాయం మాత్రమే వసూలైంది. బడ్జెట్లో నిర్దేశించిన రూ.1.64 లక్షల కోట్ల పన్నుల ఆదాయంలో, సెప్టెంబర్ 30 నాటికి రూ.69,000 కోట్లు మాత్రమే వచ్చింది. రూ.13,000 కోట్ల లోటు ఏర్పడింది. దీంతో పథకాల అమలు సవాల్‌గా మారింది.
ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. బీరుకు రూ.20, భారతీయ తయారీ విదేశీ మద్యంలో ప్రతీ క్వార్టర్ బాటిల్‌కు రూ.20 నుంచి రూ.70 వరకు ధరలు పెంచే ప్రతిపాదనలు పరిశీలిస్త్తున్నది. తద్వారా నెలకు అదనంగా రూ.1,000 కోట్ల ఆదాయం ఆర్జించవచ్చని, కొంత ఆర్థిక ఉపశమనం పొందవచ్చని అంచనా వేస్తున్నది. ప్రస్తుతానికి ఆస్తి, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు జోలికి వెళ్లడం లేదని తెలిసింది. ప్రభుత్వం భూములను అమ్మేందుకు కూడా చర్యలు చేపట్టింది. ప్రైమ్ ఏరియాల్లోని ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేసి, వేలం వేయడానికి ప్రతిపాదనలు పంపాలని హెచ్ఎండీఏతో పాటు అన్ని పట్టణ అభివృద్ధి సంస్థలను ఆదేశించింది. రాజీవ్ గృహకల్ప వంటి పథకాల కింద అమ్మకానికి లేని ఫ్లాట్లను విక్రయించడంపైనా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
కేంద్రం ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థల నుంచి బకాయి వసూలుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ప్రైవేట్ కంపెనీలతో కలసి నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేశారు. పన్నులు, జరిమానాల చెల్లింపులో ప్రజలను ప్రోత్సహించేలా వన్-టైం సెటిల్మెంట్ సీమ్ అమలును పరిశీలిస్తున్నది.
ఆర్థిక సంవత్సరానికి రూ.2.74 లక్షల కోట్ల లక్ష్యం ఆరు నెలల్లో రూ.1.08 లక్షల కోట్ల ఆదాయం రాక పన్నుల ఆదాయ లక్ష్యం రూ.1.64 లక్షల కోట్లు సెప్టెంబర్ 30 నాటికి రూ.69,000 కోట్లే వసూలు