హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తేతెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలోని బలహీనవర్గాలను అణగదొక్కేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు రహస్య కుట్రలకు తెరలేపారని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ ధ్వజమెత్తారు. తప్పుల తడకగా కులగణన సర్వే నిర్వహించి బీసీ జనాభా తగ్గినట్టుగా చూపుతున్నారని మండిపడ్డారు. నాడు ఓట్ల కోసం 42% బీసీ కోటా ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఎత్తేసేందుకు యత్నిస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. కేవలం 60 నుంచి 65% కుటుంబాల నుంచే వివరాలు సేకరించారని విమర్శించారు. హైదరాబాద్లో అయితే 25% మాత్రమే సర్వే చేసి మిగతా కుటుంబాలను విస్మరించారని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో 52% ఉన్న బీసీ జనాభా ఏకంగా 7 శాతానికి తగ్గించి చూపడం దారుణమని పేర్కొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వేల్లోనూ బీసీల జనాభా 57 శాతానికి పైగా ఉన్నట్టు తేలిందని తెలిపారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం బీసీ జనాభా గణనీయంగా తగ్గిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీల అభ్యున్నతిపై సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే తిరిగి మళ్లీ సర్వే నిర్వహించాలని కృష్ణమోహన్ డిమాండ్ చేశారు.