Warangal | 35 విభాగాలు.. 77 యూనిట్లు.. 500 మంది వైద్యులు.. 1,000 మంది నర్సులు.. 24 అంతస్తుల భవనం.. 200 ఎకరాల సువిశాల ప్రాంగణం.. 1,100 కోట్ల రూపాయల ఖర్చు.. ట్విన్ సిటీస్ ప్రజల స్వప్నం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. దేశంలోనే అతిపెద్ద దవాఖాన నిర్మాణం.. హెల్త్ సిటీగా చారిత్రక ఓరుగల్లు నగరం.
చారిత్రక నగరం వరంగల్ హెల్త్ సిటీగా మారుతున్నది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానను వరంగల్‌లో కేసీఆర్ సర్కారు నిర్మిస్తున్నది. రూ.1,100 కోట్లతో 24 అంతస్తులు, అత్యాధునిక హంగులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూపుదిద్దుకుంటున్నది. దీనికి 2021 జూన్21న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయగా, పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 35 విభాగాల ద్వారా వైద్యసేవలు అందించేలా ప్రణాళికలు చేశారు. గుండె, కాలేయ మార్పిడి ఆపరేషన్లతో పాటు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన కీమోథెరపీ, రేడియేషన్ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉంటాయి.
వరంగల్‌లో హెల్త్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ఇప్పటికే కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వరంగల్‌ను అత్యాధునిక వైద్య సేవల కేంద్రం గా తీర్చిదిద్దడంలో భాగంగా 2014లో సీఎం కేసీఆర్ ఇక్కడ రాష్ట్రంలోనే ఏకైక హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా పేరు పెట్టా రు. అనంతరం ఐదు ఎకరాల్లో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనం పక్కనే ఉన్న స్థలంలో ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు సాగుతున్నాయి. వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్, కాకతీయ మెడికల్ కాలేజీ, కంటి దవాఖాన, సెంట్రల్ జైలు స్థలం కలిపి 200 ఎకరాల వరకు అవుతుందని.. ఆ ప్రాంతాన్ని ఇంటిగ్రేటెడ్ హెల్త్ కాంప్లెక్సుగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిలో భాగంగానే వరంగల్ నగరానికి డెంటల్ (దంత), వెటర్నరీ కాలేజీలను మంజూరు చేశారు. ప్రస్తుత ఎంజీఎంను మాతాశిశు సంరక్షణ (ఎంసీహెచ్) కేంద్రంగా అభివృద్ధి చేసి ఒకేసారి 1500 మందికి సేవలందించేలా కొత్త భవనం నిర్మించాలనే ప్రణాళికలు ఉన్నాయి.
ఈ భవనాన్ని పూర్తి పర్యావరణ హితంగా నిర్మిస్తున్నారు. వైద్య సేవల కారణంగా ఉత్పన్నమయ్యే వ్యర్థాల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా గార్డెనింగ్ ఏర్పాటు చేయనున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్వార్టర్స్ నిర్మించనున్నారు.
హెల్త్ సిటీ ఆవరణలోనే కాకతీయ మెడికల్ కాలేజీ ఉన్నది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు అనుబంధంగా ఈ కాలేజీ ఉండనున్నది. అన్ని రకాల వైద్య సేవలకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో కొత్త హాస్పిటల్ భవనాన్ని నిర్మిస్తున్నారు. వైద్య సేవలకు సంబంధించి దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు ఉండనున్నాయి. ఇందులో 35 విభాగాలు, 77 యూనిట్లు ఉంటాయి. రెండు వేల పడకలను ఏర్పాటు చేస్తారు. 500 మంది డాక్టర్లు, వెయ్యి మంది నర్సులు, పారామెడికల్ సిబ్బంది సేవలందించనున్నారు. ఐదు అంతస్తుల్లో ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేస్తారు. ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అవయవాల మార్పిడి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నొస్టిక్స్, సర్జికల్, మెడికల్, ఐసీయూ విభాగాలు ఉంటాయి. శస్త్ర చికిత్సలు, అత్యవసర సేవల కోసం సెంట్రల్ స్టెరిలైజేషన్ యూనిట్‌ను నిర్మిస్తారు. రోగులు, డాక్టర్లు, వైద్య సిబ్బందికి సమయానికి ఆహారం అందించేందుకు సెంట్రల్ కిచెన్ ఉంటుంది.
… గోపాల్ పిన్నింటి