హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన పోస్టులను మంజూరు చేసింది. గ్రూప్-4లో మున్సిపల్శాఖకే అత్యధికంగా 2,701 పోస్టు లు మంజూరయ్యాయి. వీటిలో 238 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 601 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున పోస్టులను మంజూరు చేయడం ఇదే ప్రథమం. వీటి భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
దీంతో 50 వేల వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక వార్డు ఆఫీసర్, 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఒక వార్డు ఆఫీసర్ ఉంటారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు గతంలో ఒకేసారి 9 వేల మందికిపైగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. ఇది పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేందుకు ఎంతో దోహదపడింది. ఇదే విధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిపాలనను మెరుగుపరిచేందుకు ప్రతి వార్డుకూ ఓ ఆఫీసర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దేశంలో ఎక్కడా లేని ఈ విధానాన్ని తొలిసారి తెలంగాణలో అమలు చేయనున్నారు. దీంతో అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలువనున్నది.