హైదరాబాద్: మట్టికైనా.. మానుకైనా.. మనిషికైనా జీవం పోసేది నీళ్లే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నీటి అవసరాలను తీర్చడాన్ని ఒక తపస్సులా భావించారు. గత ఏడున్నరేళ్లలో ఎవరూ ఊహించని అద్భుతాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం 85.89 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది.
శతాబ్దాలుగా తెలంగాణ వ్యవసాయానికి ఆదరవుగా ఉన్నచెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం మిషన్ కతీయపేరుతో పెద్దఎత్తున చేపట్టింది. రూ.5,350 కోట్లు వెచ్చించి చెరువులను, చెక్ డ్యాంలను పునరుద్ధరించింది. వీటి కింద 15.05 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది. చెరువుల్లో నిలువ సామర్థ్యం పెరిగింది. ఈ చెరువులన్నింటిని సర్కారు ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశచరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యింది. వాటితో ఆయా ప్రాంతాలకు సాగునీరు లభిస్తోంది. సాధారణంగా రిజర్వాయర్ల నిర్మాణం నదీ మార్గంలోజరుగుతుంది. కానీ, దీనికి భిన్నంగా నదీ, వాగు ఏదీలేని చోట అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ నిర్మాణం కావడం సాగునీటిరంగ చరిత్రలోనే ఒక అద్భుతం.