హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ర్టాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్‌శక్తితో చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సమావేశానికి సంబంధించి ఎజెండా అంశాలపై అధికారులతో చర్చిస్తున్నది. కృష్ణా జలాలకు సంబంధించిన అంశాలకే సమావేశంలో పరిమితవ్వాలని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. జలవివాదాల పరిష్కారానికి 15 మంది అధికారులతో కేంద్రం ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కమిటీకి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వం వహించనుండగా, ఇరు రాష్ర్టాలు, పలు కేంద్ర సంస్థల నుంచి కీలక అధికారులు పాల్గొననున్నారు. ఈ నిపుణుల కమిటీ న్యూఢిల్లీ సేవాభవన్‌లోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో ఈ నెల 30న తొలిసారి భేటీ కానున్నది. ఈ భేటీలో నీటినిర్వహణకు సంబంధించి వివాదాస్పద, పరిష్కరించాల్సిన కీలక అంశాలను కమిటీలో చర్చ కోసం తక్షణమే సమర్పించాలని కేంద్రం ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో కమిటీ భేటీ కోసం ఎజెండా అంశాలను ఎంపికచేసే అంశంపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తున్నది. ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎజెండాపై ఆచితూచి వ్యవహరిస్తున్నది.