హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్‌నే కలవరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. సోమవారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వృత్తి కులాలకు ఏవైనా వరాలు ప్రకటిస్తారని అంతా ఆశించారని, పాపన్న గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడతారని అనుకున్నామని, కానీ అలా జరగలేదని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
‘సీఎం రేవంత్ ఎక్కడకు వెళ్లినా కేసీఆర్‌ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. రాత్రి నిద్రలో కూడా సీఎం రేవంత్ కేసీఆర్‌నే కలవరిస్తున్నారు. ప్రతి దానికి కేసీఆర్ కారణం అనడం తప్ప రేవంత్ చేసిన మంచి పని ఏదీ లేదు. ఎన్నికల్లో గౌడ సోదరులకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. ఆ హామీల అమలు గురించి మాట్లాడకుండా రేవంత్ వేరే విషయాలు మాట్లాడుతున్నారు. ఎన్నికలప్పుడూ అబద్దాలే, ఇప్పుడూ అబద్దాలేనా..?’ అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
‘కేసీఆర్ యాభై శాతంలోపు రిజర్వేషన్లకు చట్టం తెచ్చారని రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ 62 శాతం రిజర్వేషన్ల కోసం ప్రయత్నించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే. కాంగ్రెస్ నేతలు స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు యాభై శాతం క్యాప్ విధించేందుకు కారణమయ్యారు. రిజర్వేషన్ల క్యాప్‌కు కాంగ్రెస్ నేతలు కారణం కాదని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్‌గాంధీ, సోనియాగాంధీల మీద ఒట్టేసి చెప్పగలరా..? అని మాజీ మంత్రి నిలదీశారు.
‘రేవంత్ అబద్దాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. 20 నెలల్లో 700 మంది గీత కార్మికులు వివిధ ప్రమాదాల్లో మరణించారు. వారికి ఎక్స్ గ్రేషియా కూడా చెల్లించడం లేదు. వైన్ షాపుల్లో గౌడ సోదరులకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఆ హామీని అమలు చేసే దమ్ములేక కేసీఆర్‌పై నెపం నెడుతున్నారు. కులవృత్తులకు కేసీఆర్ హయాంలో అమలైన పథకాలను ఇపుడు తుంగలో తొక్కారు’ అని ఆరోపించారు.
‘సర్వాయి పాపన్న పాలించిన ప్రాంతాలను మైనింగ్‌కు అప్పజెప్పామని రేవంత్ నిరాధార ఆరోపణ చేశారు. పాపన్న పాలించిన ప్రాంతాలను పురావస్తు శాఖకు అప్పగిస్తూ జీవో ఇచ్చింది కేసీఆర్ పాలనలోనే. రేవంత్ హయాంలోనే పాపన్న పాలించిన ప్రాంతాలను మైనింగ్‌కు ఇచ్చారు. ఆ మైనింగ్‌ను కాంగ్రెస్ నేతలకే అప్పగించారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు పెట్టలేదు’ అని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
‘పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ అని సంబోధించిన విషయాన్ని శ్రీనివాస్ గౌడ్ ప్రస్తావించారు. కల్తీ కల్లు పేరుతో గౌడ సోదరులను జైల్లో పెట్టినందుకు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్‌ను రేవంత్ గౌడ్ అని పిలిచారా..? గౌడ సోదరులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి రేవంత్ గౌడ్ అయ్యారా..?
’ అని మండిపడ్డారు.
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం తెచ్చి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. అబద్దాలు తగ్గించి హామీల అమలుపై దృష్టి సారించాలి. మంచి పనులకు క్రెడిట్ తీసుకుని, చెడ్డ పనులకు కేసీఆర్ కారణమంటే ఊరుకునేది లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి’ అని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఈ ప్రెస్మీట్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీఆర్ఎస్ నేత గౌతం ప్రసాద్ కూడా పాల్గొన్నారు.