2014 జూన్ 2.. ఆరున్నర దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన రోజు.. తెలంగాణ స్వరాష్ట్రమై నిలిచిన రోజు! ఈ నేల ఆత్మగౌరవం కోసం అలుపెరగని పోరాటం సాగించిన కేసీఆర్.. స్వరాష్ర్టాన్ని సాధించి, అమరులకు నివాళిగా అర్పించిన రోజు.. తెలంగాణకు ఇది 11వ పుట్టినరోజు. ఇది తెలంగాణ ఇంటిపార్టీ బీఆర్ఎస్కు రజతోత్సవ ఏడాది కూడా. ఏప్రిల్ 27న ఓరుగల్లు సభతో సంబురాలను ప్రారంభించుకున్నది బీఆర్ఎస్. అమెరికాలోని డాలస్‌లోనూ వేడుకలను నిర్వహిస్తున్నది. అటు రాష్ర్టావతరణను, ఇటు రజతోత్సవాలను కలిపి జరుపుతున్న వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
Jai Telangana | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలతో అమెరికాలోని డాలస్ నగర వీధులు, డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణమంతా ‘జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగింది. అమెరికా గడ్డ మీద గులాబీ దళం అలయ్-బలయ్ తీసుకున్నది. అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని తెలంగాణబిడ్డలు, తెలంగాణ నుంచి వెళ్లిన మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో డాలస్ పట్టణం సంబురంతో ఊగిపోయింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు డాలస్‌కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పార్టీ ఎన్నారై సెల్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల, బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ చైర్మన్ మహేశ్ తన్నీరు సారథ్యంలో ఎన్నారైలు అపూర్వస్వాగతం పలికారు.
ఆదివారం సాయంత్రం 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం జూన్ 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు) యూఎస్ఏలోని డాలస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు, బీఆర్ఎస్ రజతోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని దాదాపు అన్ని రాష్ర్టాలు, అన్ని ప్రధా న నగరాల్లోని తెలంగాణ బిడ్డలు డాలస్‌కు చేరుకోవడంతో సందడి నెలకొన్నది. న్యూజెర్సీ, చికాగో, డెలావేర్, హ్యూస్టన్, టెక్సాస్, కొలంబస్, ఆస్టిన్, ఫ్లోరిడా, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజెల్స్, న్యూయార్క్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా తెలంగాణబిడ్డలు డాలస్‌కు తరలివచ్చారు.
యూఎస్ఏలోని పలు ప్రాంతాల్లో ఉం టున్న తెలంగాణబిడ్డలు డాలస్ వేదిక వద్దకు తెలంగాణలోని తమతమ సొంత జిల్లాల సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలు ఉట్టిపడేలా వేషధారణ, చిత్రపటాలు చేబూని రావడంతో డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాలస్ ప్రాంగణంలో ఏ ఇద్దరు ఎదురుపడినా ‘హాయ్.. నమస్తే’కు బదులు ‘జై తెలంగాణ…జైజై తెలంగాణ’, ‘జై కేసీఆర్… జైజై కేసీఆర్’ అంటూ పలకరించుకోవడం ప్రత్యేక ఆకర్షణ అయింది. తెలంగాణలో ప్రస్తుతం అన్ని వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని పారద్రోలే శక్తి, సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉన్నదని తెలంగాణ ఎన్నారైలు చర్చించుకోవడం కనిపించింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో తాము విదేశాల్లో ఉన్నా మాతృభూమి విముక్తి కోసం, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాలు చేశామని, అయితే, ప్రస్తుతం తెలంగాణలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, దగా పడుతున్న తెలంగాణ తిరిగి దరికి చేరేందుకు నాడు రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినట్టుగానే ప్రస్తుతం మరోసారి కార్యరంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైందని ఎన్నారైలు చర్చించుకుంటున్నారు. తెలంగాణ సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించేందుకు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని తెలంగాణబిడ్డలు బతుకమ్మ, బోనాలతో కళారూపాలు ప్రదర్శించడం ఆహుతులను విశేషంగా ఆకర్షించింది.
డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు, బీఆర్ఎస్ రజతోత్సవాలకు ముఖ్యఅథితిగా హాజరయ్యేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం తెల్లవారుజామున (మనకు ఆదివారం ఉదయం 5 గంటలకు) డాలస్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా విమానాశ్రయం ప్రాంగ ణం అంతా గులాబీమయమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా నుంచి అమెరికాలో ఉంటున్న తెలంగాణబిడ్డలు విమానాశ్రయానికి చేరుకొని కేటీఆర్‌కు అపూర్వస్వాగతం పలికారు. ‘వెల్కం టు టార్చ్ బేరర్ ఆఫ్ తెలంగాణ.. మిస్టర్ కేటీఆర్’, ‘సిరిసిల్ల టు సిలికాన్ వ్యాలీ’ అంటూ ప్లకార్డులతో యువకులు, పార్టీ ఎన్నారై విభాగ ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు.
కేటీఆర్‌కు స్వా గతం పలికినవారిలో పార్టీ ఎన్నారై సెల్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల, బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ చైర్మన్ మహేశ్ తన్నీరు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి, గంగుల, కొప్పుల ఈశ్వర్, వీ శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిశోర్, చంటి క్రాంతికిరణ్, కోరుకంటి చందర్, పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, కోలేటి దామోదర్ తదితరులున్నారు. ఎన్నారైల్లో రావు కల్వల, తిరుపతిరెడ్డి, ఆశిష్యాదవ్, అభిలాశ్ పాల్గొన్నారు. ఉదయ్ యాదవ్, సామ్ పుసపల్లి, శశి, అనిల్‌తోపాటు యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
అమెరికాలో కేటీఆర్ ల్యాండ్ అయినప్పటినుంచి గతంలో కన్నా ఇప్పుడు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. అఫీషియల్స్ ప్రొటోకాల్‌ను ఏర్పాటుచేశారు. ఆ ఆఫీషియల్స్ గుర్తించినవారిలో ఇన్నర్ సర్కిల్‌లోకి తీసుకున్నారు. భద్రతా కారణాలతో తక్కినవారిని అవుటర్ సర్కిల్లో ఉం చారు. విమానాశ్రయం నుంచి కేటీఆర్‌ను స్పెష ల్ ఎస్కార్ట్, భారీ కాన్వాయ్‌తో డాలస్ విడిది కేంద్రానికి తోడ్కొని వెళ్లడం మరో విశేషం.