హైదరాబాద్ : దేశమంతా విద్యుత్ సంక్షోభం ఉన్నా.. తెలంగాణ మాత్రం విద్యుద్దీప కాంతుల్లో వెలిగిపోతుందని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ ప్రాంగణంలో మంగళవారం తెలంగాణ విద్యుత్ ఇంజినీర్ల అసోసియేషన్ (టీఈఈఏ) ఆధ్వర్యంలో ‘కరంటోళ్ల సంబురాలు’ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కొందరు విద్యుత్ సంక్షోభం వస్తుందన్నారనీ, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం, అందరి సహకారంతో రాష్ట్రమంతా నేడు 24 గంగటల నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు.
పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, పంపిణీలో దేశంలో అగ్రగామిగా ఉన్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో 2012 యూనిట్లతో దేశంలోనే ప్రధానమైన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. అందరు కలిసికట్టుగా పని చేస్తున్నందునే ఇది సాధ్యమైందన్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోనూ సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో పీఆర్సీకి ఒప్పుకున్నారన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, తప్పకుండా మంచి పీఆర్సీ ఇస్తారని భరోసా ఇచ్చారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు.
ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీఎం కేసీఆర్‌తో పనిచేసే అవకాశం రావడాన్ని విద్యుత్ ఉద్యోగులు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణంలో సాంస్కృతిక విప్లవం కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ నేలకు ఉన్న గంగాజమున తెహజీబ్ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పౌర సమాజంపై ఉందన్నారు. మనిషిని మనిషి ప్రేమించే ఈ నేలలో విద్వేషాలకు తావు ఇవ్వొద్దన్నారు. మనుషుల మధ్య కులమతాల చిచ్చులు పెట్టే శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ.. పీఆర్సీ కమిటీ వేసి, ఉద్యోగాల్లో ధైర్యం నింపిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి ఏపీలోనూ లేనంతగా 14,160 మెగావాట్ల డిమాండ్‌ను రికార్డు చేయడంతో, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలపడంతో సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్‌రావు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి అవసరమైంది ఏదైనా చేసేందుకు టీఈఈఏ సిద్ధంగా ఉందన్నారు. జేఎండీ శ్రీనివాసరావు, టీఈఈఏ ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య శెట్టి, ముఖ్య సలహాదారు సురేందర్‌రెడ్డి, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనా ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు కళాకారులు గుండు శ్రీనివాస్, గాయకుడు శంకరం బాబ్జీలను సన్మానించి, రూ.50వేల చొప్పున చెక్కును బహూకరించారు.