హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అగ్నిమాపకశాఖ ప్రమాదాలపై ఆలస్యంగా మేల్కొన్నది. వరుసగా ప్రమాదాలు జరుగుతూ పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంతో ఆశాఖపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ ఫైర్ అధికారులకు అత్యవసర ప్రాతిపదికన ఓఆర్ఆర్ పరిధిలోని భవనాల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో సెల్లార్లను పారింగ్కు కాకుండా స్టోరేజ్‌గా వినియోగించడం, సెల్లార్లల్లో వాచ్మెన్ల కుంటుంబాలకు ఆశ్రయం కల్పించడం వంటివి అధికారులు గుర్తించారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మెట్ల మార్గాలు లేని భవనాలతోపాటు, ఆయా భవనాల్లో అవసరాలకు మించి భారీగా వస్తువులను సెల్లార్లో నిల్వ చేసినట్టు తేల్చారు. మొత్తం 70 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన అధికారులు.. యజమానులు, అద్దెదారులు, ఉద్యోగులకు ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.