చౌటుప్పల్: కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అన్ని రంగాల్లో తెలంగాణపై వివక్ష చూపుతున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్‌లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి హరీశ్‌రావు BRS ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కుట్రల పార్టీ అని విమర్శించారు. BRS పార్టీ ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. బీజేపీ అధికారం కోసం పన్నాగాలు పన్నుతోందని, BRS వి పథకాలైతే, BJP వి పన్నాగాలని మండిపడ్డారు. బీజేపీ పన్నాగాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి విషయంలో దేశంలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం ఏదైనా ఉందా అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణలో రూ.2 వేల పెన్షన్ ఇస్తుంటే.. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న గుజరాత్లో మాత్రం కేవలం రూ.600 మాత్రమే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. నలభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం రైతుబంధు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను ఎందుకు తీసుకురాలేదన్నారు. భారతీయ జనతాపార్టీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మూడోసారి కూడా BRS పార్టీదే అధికారమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గనకల్చర్.. బీఆర్ఎస్ పాలనలో ఉన్న రాష్ట్రంలో అగ్రికల్చర్ ప్రధానమైనవిగా ఉన్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతుల సంపద పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథాకాలవల్లే తెలంగాణలో భూముల విలువ పెరిగిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువలు కొట్లాట ఎక్కడైనా ఉందా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు ఎరువుల కోసం మళ్లీ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.