హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఎరువుల సరఫరాలో తెలంగాణ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ మాడల్‌గా మారిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శిగా నిలిచిందని పేర్కొన్నారు. ఆదివారం మంత్రి తుమ్మల హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ యాప్‌లో రియల్ టైమ్ స్టాక్ విజిబిలిటీ, రైతువారి డిజిటల్ బుకింగ్, పంటల ఆధారిత ఎరువుల కేటాయింపు, డాష్ బోర్డు పర్యవేక్షణ, డాటా ఆధారిత సరఫరా వ్యవస్థ వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసే డిజిటల్ వ్యవసాయ పరిపాలనకు తెలంగాణ మాడల్ దోహదం చేసిందని వెల్లడించారు.
యూరియా కొరతపై ప్రతిపక్ష పార్టీలు రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరించాయని.. రైతుల ముసుగులో రాజకీయ ప్రేరేపిత ఆందోళనలకు దిగజారుడు రాజకీయం చేశాయని ఆరోపించారు. రాజకీయ కోణంలో కాకుండా రైతులకు మేలు చేసేలా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రూపకల్పన చేసినట్టు పేరొన్నారు. యాప్ వల్ల యూరియా దుకాణాల్లో స్టాక్ సమాచారం రైతులు తెలుసుకోవడంతోపాటు ఆందోళన లేకుండా బుకింగ్ చేసుకొని యూరియా తీసుకొనే వెసులుబాటు కల్పించామని వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా బస్తాలు తెచ్చుకొనేలా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతులకు మేలు చేస్తున్నదని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.