హనుమకొండ సబర్బన్, జూలై 10 : ప్రభుత్వం సన్నవడ్లు పండించిన రైతులకు రూ. 500 బోనస్‌గా ఇస్తామని రెండేండ్ల క్రితం ప్రకటించింది. మొదటి సంవత్సరం కొంతమేరకు బోనస్ ఇచ్చిన సర్కార్ ఆ తర్వాత కోతల విధింపు మొదలు పెట్టింది. రాష్ట్రంలో రైతులు 36 రకాలను సన్నవడ్లుగా పండిస్తారు. ప్రభు త్వం కేవలం 8 రకాల ధాన్యాన్ని మాత్రమే కొంటామని ప్రకటించింది. వరంగల్ వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో విడుదలైన డబ్ల్యూజీఎల్ – 962 రకాన్ని ఆ జాబితాలో చేర్చారు. సీఎం రేవంత్ బొమ్మ వేసి నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం అనే ట్యాగ్ తగిలించి వ్యవసాయ ప్రాంతీయ పరిశోధనా స్థానం వరంగల్ అధికారులు రైతులకు అంటగట్టారు. ఎకరాకు 20కిలోల చొప్పున రూ. 1,500కు అమ్మారు. వరంగల్ ఆర్‌ఏఆర్‌ఎస్ నుంచి 1,000 క్వింటాళ్లు, మల్యాల పరిశోధనా క్షేత్రం నుంచి 100 క్వింటాళ్ల వరకు రైతులు డబ్ల్యూజీఎల్ 962 రకం వరి విత్తనాలను తీసుకెళ్లి నార్లు పోసుకున్నారు. తీరా అవి మొలిచిన తర్వాత వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కొత్త జాబితా విడుదల చేశారు. ఇందు లో బీపీటీ 5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్) 15048, కేఎన్ఎం 1638, జై శ్రీరాం, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్ 44 (సిద్ధి), కేఎన్ఎం 7715 రకాలను చేర్చారు. డబ్ల్యూజీఎల్ – 962 ఊసే ఎత్తలేదు. దీంతో ఈ రకం విత్తనాలు పోసుకున్న రైతులు ఆగమా గం అవుతున్నారు. ఈ రకం వడ్లకు బోనస్ ఇవ్వని పక్షంలో రూ. 15కోట్ల వరకు నష్టపో యే ప్రమాదం ఉంది. అధికారులు మాత్రం 1638 అనే రకంలో ఈ వడ్లు అమ్ముకోవచ్చని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బొమ్మ పెట్టి అమ్మిన విత్తన రకానికే బోనస్ లేదనడం విచిత్రంగా ఉందని రైతులు విమర్శిస్తున్నారు.
వరంగల్ వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో విడుదలయ్యే పలురకాల విత్తనాలంటే నమ్మకంగా ఉంటది. అధికారులు చెప్పిన మాటలు విని బోనస్ వస్తదనుకొని డబ్ల్యూజీఎల్ 962 విత్తన రకాన్ని కొనుక్కున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటించిన జాబితాలో ఈ రకం లేదు. దీంతో ఈ రకం తెచ్చుకున్న రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. మా ఊరికే 50 క్వింటాళ్ల వరకు ఈ విత్తన రకం తెచ్చారు.
డబ్ల్యూజీఎల్ 962 అనే రకానికి బోనస్ వస్తుందని అధికారులు నమ్మకంగా చెప్పారు. దిగుబడి కూడా బాగా వస్తుందని చెప్పడంతో మేమందరం కలిసి ఇదే విత్తనాన్ని మా ఊరికి తీసుకొచ్చి నార్లు పోసుకున్నాం. ఇప్పుడు ఈ రకానికి బోనస్ రాదని చెబుతున్నారు. అధికారులు పొంతన లేని ముచ్చట్లు చెప్తున్నారు. మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.