హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వమన్నా, ఇక్కడి రైతులన్నా ప్రధాని మోదీకి అస్సలు నచ్చరని, అందుకే ఇక్కడ ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం పట్టించుకోకపొయినా రైతులకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని, పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి వారికి భరోసా ఇచ్చారని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించి గంటలోపు ఉత్తర్వులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని కొనియాడారు. పంటనష్టంపై ప్రాథమిక అంచనా వేస్తున్నామని, నష్టపోయిన రైతులకు రూ.10 వేలు అందజేస్తామని తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓవైపు సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ సాయం చేస్తుం టే.. మరోవైపు పనిలేని ప్రతిపక్షాలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న రైతులతో ప్రతిపక్షాలు నీచ రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నేతలు.. కేంద్రం నుంచి రైతులకు సాయం ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. రూపాయి సాయం చేసే తెలివి లేకున్నా… అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర నిబంధనల ప్రకారం మకజొన్నకు రూ. 3300 మాత్రమే నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని, కానీ సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎకరాకు రూ. 10 వేలు ప్రకటించారని తెలిపారు. స్వయంగా రైతు అయిన కేసీఆర్… రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ రైతులు చేసుకున్న అదృష్టమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమాతో రైతుల కన్నా.. కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకే మేలు జరుగుతున్నదని విమర్శించారు. ఆ పథకం అంత గొప్పదే అయితే.. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు అమలు చేయడం లేదో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతులు, ప్రజలు గుర్తుకు వస్తారని, ఆ తరువాత కార్పొరేట్ కంపెనీలను, బడా దోస్తులను మాత్రమే గుర్తుంచుకుంటారని విమర్శించారు.
కేసీఆర్ సార్ మాటలతో దైర్నమచ్చింది
కేసీఆర్ సారు సీఎం అయినంకనే మా కష్టాలన్నీ తీరినయ్. ఎవుసం చేసుకునెతానికి అన్ని వసతులు కల్పించిండు. ఉమ్మడి రాష్ట్రంల ఆయన లెక్క ఆలోచించెటోళ్లు ఉంటే రైతులు ఇప్పటికే బందవస్తు అయ్యెటోళ్లు. కేసీఆర్ అచ్చినంక ఎవుసం మంచిగ సాగుతున్నది. ఇసోంటి టైంల రాళ్లువడి నా మామిడి పంట దెబ్బతిన్నది. రాళ్ల దెబ్బకు కాయలన్నీ రాలిపోయినయ్. ఒక్క చెట్టుకు సుతం కాయలేకుంట అయ్యింది. కాయలున్నా అక్కెర్రావు. చానా నష్టం జరిగింది. ఈ ముచ్చట తెలుసుకున్నంక సీఎం కేసీఆర్ సార్ మా తోట్లకచ్చి నాతోని మాట్లాడిండు. ఎన్ని చెట్లున్నయ్? యాట ఎంత కాతస్తుంది? లాభమెంత ఉంటంది? అని అడిగిండ్రు. చానా ఓపికతోని నాతోని మాట్లాడిండ్రు. నేను అన్నిటికీ బదులిచ్చిన. నష్టం బాగనే అయ్యిందని చెప్పి బాధపడకుమని ఓదార్చిండ్రు. చానా మంచిగనిపించింది. సార్ వచ్చిండంటనే నాకు ఎంతో దైర్నమచ్చింది. మమ్ములను ఆదుకుంటరనే నమ్మకం ఉన్నది. ఆయనకు మాబోటి రైతులంటే చానా ఇష్టం.
– ఎడవెల్లి రాజిరెడ్డి, మామిడి రైతు, గుండి, రామడుగు మండలం, కరీంనగర్
సార్ మాటతో ఊపిరచ్చింది
నేను రెండెకరాల్లో మక్కజొ న్న పండిస్తున్న. మొన్న కురిసిన వానకు పంట నేల మట్టమయింది. పంట చేతికిరాకుండా పోయింది. పెట్టుబడైనా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. సీఎం కేసీఆర్ సారు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తాడని చెప్పిన తర్వాత నాకు ఊపిరి తిరిగొచ్చింది. మా లాంటి ఎందరో రైతులకు మంచి జరుగుతది. జరిగిన నష్టం పూడుతది. తెలంగాణ వచ్చినంకనే రైతులను పట్టించుకొనుడు మొదలైంది. అంతకుమందు అట్ల లేదు.
– వాగబోయిన కృష్ణ, రైతు, గుండాల మండలం, భద్రాద్రి జిల్లా
పానం నిమ్మలమైంది
రాళ్లవాన పడి మక్కజొన్న చేనంతా నేలమీద పడిపోయింది. చేనును చూసి ఏడిశిన. ఆ పార్టీ, ఈ పార్టీ వాళ్లు వచ్చి చూసిండ్రు. నన్ను పట్టుకుని ఫొటోలు దిగిండ్రు తప్ప నాకు ఏమీ చెప్పలే. ఏమీ ఇయ్యలే. మక్కజొన్నకు మంచి ధర ఉందని పత్తి తీసి వేసి సాగు చేసిన. కొన్ని రోజులైతే పంట చేతికి వచ్చేది. ఇంతల రాళ్ల వానతో పంట కింద పడిపోతే ఇంట్లోళ్లందరం రందిల పడ్డం. నేను ఎకరం పావు మక్కజొన్న పెట్టిన. 30 గుంటల పొలం వేసిన. పొలం పొట్టకు వచ్చింది. వానకు పొట్ట పగిలిపోయింది. నిన్న కేసీఆర్ సారు ఎకరానికి రూ.10 వేలు ఇస్తనని చెప్పినంక పానం నిమ్మలమైంది. 15 ఏండ్ల కింద గిట్ల పంట పాడైపోతే సర్కార్ ఏమీ ఇయ్యలే. రాళ్లవానకు రైతుల పంటపొలాలు దెబ్బతిన్నయని తెలిసి ఇంత తొందరగా కేసీఆర్ సారు వచ్చిండు. పంటలను చూసి రైతుకు దైర్నం చెప్పిండు. కష్టమచ్చినప్పుడు ఆదుకున్న సారుకు రుణపడి ఉంటం. నీళ్లు మస్తు ఉన్నయ్.. ఇంకో పంట ఏసేందుకు దుక్కి చేసుకుంట.
– పుప్పాల నర్సయ్య, కొమ్ములవంచ, నర్సింహులపేట మండలం, మహబూబాబాద్ జిల్లా
ఇంత పరిహారం ఎప్పుడూ ఇవ్వలే
గతంలో అకాల వర్షాలతో పెద్దమొత్తంలో పంట నష్టం వాటిల్లి నష్టపోయినా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించడం హర్షణీయం. ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కేసీఆర్ అందిస్తున్న సాయంతో మాలాంటి ఎంతోమంది రైతులకు మేలు జరుగుతుంది.
– లక్ష్మణ్, రైతు కోనాపూర్, బాన్సువాడ, కామారెడ్డి జిల్లా
వచ్చే పంటకన్న అక్కరకత్తయ్
గతంలో రాళ్లవానలు పడ్డప్పుడు పంటలన్నీ నేలపాలనయ్. అప్పుడు మమ్మల్ని ఆదుకున్న నాథుడు లేడు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తానని హమీ ఇచ్చారు. ఆయన చెప్పిండంటే చాలు చేసి చూపిస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. ఈ పైసలు వచ్చే పంటకైనా అక్కరకు వస్తాయి. చెడగొట్టు వానలకు జరిగిన పంట నష్టానికి రూ.10 వేలు ఇచ్చి ఆదుకుంటున్న సర్కారుకు రుణపడి ఉంటం.
– కొమ్మిడి పెరుమాల్రెడ్డి, రైతు, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా