కేసీఆర్ హయాంలో పదేండ్ల పాటు పండుగలా సాగిన ఎవుసం.. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో దండుగలా మారింది. రైతులకు ‘నేనున్నా’నంటూ కేసీఆర్ అండగా నిలిస్తే.. కాంగ్రెస్ వచ్చాక అన్నదాతలకు మళ్లీ కాళరాత్రులు తెచ్చింది. రైతు సంక్షేమమే ఎజెండాగా.. రైతును రాజుగా చేయాలన్న లక్ష్యంతో వినూత్న పథకాలు అమలు చేసి దున్నకం నుంచి మొదలు విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు, పెట్టుబడిసాయం, పంట కొనుగోళ్ల వరకూ కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిస్తే కాంగ్రెస్ సర్కార్ రైతుల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులా మార్చింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ‘రైతు ముఖాన్ని చూసి పాలకుడి సమర్థతను అంచనా వేయొచ్చు’ అన్నది పెద్దల మాట. ఒక దేశం లేదా ఒక రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉన్నదో చెప్పడానికి రైతు ముఖంలో కనిపించే సంతోషమే కొలమానం. సమాజానికి అన్నం పెట్టే అన్నదాత కన్నీరు పెడితే ఆ పాలన విఫలమైనట్టే. తెలంగాణలో రెండున్నరేండ్ల కిందటి వరకు భరోసాతో కనిపించిన రైతన్న.. ఇప్పుడు బోరున విలపిస్తున్నాడు. కేసీఆర్ పాలనలో సంబురంగా మారిన వ్యవసాయం.. నేడు కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలోకి వెళ్లిపోవడమే ఇందుకు కారణం. తెలంగాణలో ఎక్కువ మంది ఆధారపడే రంగం వ్యవసాయం. అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. రైతులకు ‘నేనున్నా’నంటూ మాజీ సీఎం కేసీఆర్ అన్నీతానై తోడునీడగా నిలిచారు. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విప్లవాత్మక పథకాలు, సంస్కరణలు అమలు చేశారు. వ్యవసాయరంగ అభివృద్ధి, రైతు సంక్షేమమే లక్ష్యంగా దున్నకం, విత్తనం, ఎరువుల నుంచి మొదలుకొని విద్యుత్తు, పెట్టుబడిసాయం, పంటల కొనుగోళ్ల వరకు అన్ని దశల్లోనూ రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి నూతన పథకాలకు శ్రీకారం చుట్టారు. పంట రుణాల మాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, గోదాంల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టారు. పంట పొలాలకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. సమైక్య రాష్ట్రంలో దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించారు. ఫలితంగా సాగు విస్తీర్ణం 1.43 కోట్ల ఎకరాల నుంచి 2.08 కోట్ల ఎకరాలకు పెరిగింది. దేశంలో వ్యవసాయం అంటే తెలంగాణ… రైతు సంక్షేమ పథకాలంటే కేసీఆర్ అనేలా మారింది.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో రాష్ట్రంలో వ్యవసాయరంగం మళ్లీ తిరోగమన బాటపట్టింది. రైతులకు మళ్లీ ఎరువుల గోస, కరెంట్ కోతలు, కొనుగోళ్ల కష్టాలు తీవ్రమయ్యాయి. కొత్త పథకాల సంగతి సరేసరి. కేసీఆర్ అమలు చేసిన రైతు సంక్షేమ పథకాల్లో కొన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయగా, మరికొన్నింటికి కోత పెడుతూ అన్నదాతలను క్షోభ పెడుతున్నది. నాడు అధికారం కోసం అలవిగాని హామీలు గుప్పించిన కాంగ్రెస్.. నమ్మిన రైతులను నట్టేట ముంచుతున్నది. కాంగ్రెస్ పాలనా వైఫల్యం కారణంగా రైతులు మళ్లీ అప్పుల పాలవుతున్నారు. అవి తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.
ఇచ్చిన హామీ: ఎకరాకు రూ.15,000
ఇస్తున్నది : ఎకరాకు రూ.12,000
బకాయి : రూ.29 వేల కోట్లు
రైతులకు పెట్టుబడి గోస తీర్చేందుకు కేసీఆర్ అమలు చేసిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పథకం రైతుబంధు. 2018 మే 10న ఈ పథకాన్ని ప్రారంభించారు. 2023 నాటికి 10 విడతల్లో సుమారు రూ.66 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు సమయానికి పెట్టుబడి సాయం అందించారు. ఈ పథకం రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదంటూ ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఇలాంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. వాస్తవానికి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేసే క్రమంలో రైతుబంధును రద్దు చేయాలని భావించినట్టు ప్రచారం జరిగింది. అయితే రైతుల నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత వస్తుందనే భయంతో వెనుకంజ వేసింది. మొదట రైతుబంధు పేరును ‘రైతు భరోసా’గా మార్చింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఎకరాకు రూ.15 వేలు వేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్.. మొదటి సీజన్లోనే ఎగనామం పెట్టింది. ఇక అప్పటి నుంచి ఏ సీజన్ పైసలు ఏ సీజన్లో పడుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. రైతుభరోసా కింద సీజన్‌కు ఎకరానికీ రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్న హామీని తుంగలో తొక్కి.. సీజన్‌కు రూ.6 వేల చొప్పున ఏడాదికి ఎకరానికీ రూ.12 వేలే పంపిణీ చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆరు సీజన్లలో రైతుభరోసా ఇవ్వాల్సి ఉన్నది. కానీ.. ఒక సీజన్‌ను పూర్తిగా ఎగ్గొట్టగా, మరో మూడు సీజన్లలో రెండు, మూడు ఎకరాలకే పంపిణీ చేసింది. ఇలా ఇప్పటివరకు రూ.6 వేల చొప్పున, రూ.12 వేల చొప్పున ఎగ్గొట్టినవి లెక్కిస్తే.. రైతులకు రూ.29 వేల కోట్లు బకాయి పడ్డట్టు తేలింది.
మొదలైంది: 2018లో కేసీఆర్ శ్రీకారం
ఎవరికి వర్తిస్తుంది?: 18-59 ఏండ్లు ఉండి పట్టా పాస్ పుస్తకం ఉన్న రైతులకుబీఆర్ఎస్ హయాంలో చెల్లించిన ప్రీమియం : ఎల్ఐసీకి ఏటా రూ.1,400 కోట్లు
రైతు కుటుంబానికి అందే పరిహారం:రూ.5 లక్షలు
కేసీఆర్ హయాంలో అందిన సాయం : 1.86 లక్షల మంది రైతుల
కుటుంబాలకు రూ. 9,107 కోట్లు..
కాంగ్రెస్ చేసిందేంది? : అధికారంలోకి వచ్చాక పథకం రద్దు
రైతుల కోసం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకాన్ని ఆగం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో ప్రతిష్ఠాత్మక పథకానికి నామరూపాల్లేకుండా చేసింది. అదే రైతుబీమా. ఏదైనా కారణంతో రైతులు మరణిస్తే, వారి కుటుంబాలకు కొండంత ఆర్థిక అండగా నిలిచే ఈ పథకాన్ని రేవంత్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. గత నెల 14తో ఈ పథకానికి చరమగీతం పాడింది. రైతుబీమా పథకాన్ని కేసీఆర్ 2018 ఆగస్టు 14న ప్రారం భించారు. 18-59 ఏండ్ల వయస్సు ఉండి, పట్టా పాస్ పుస్తకం ఉన్నవారందరికీ ఎల్ఐసీ పాలసీ చేయించారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులను కూడా ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఇలా ఏటా రూ.1,400 కోట్ల వరకు రైతుల తరఫున బీమా ప్రీమియం కింద ఎల్ఐసీకి చెల్లించేవారు. రైతులెవరైనా ఏదేని కారణంతో మరణిస్తే, వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందేది. ఇలా ఇప్పటివరకు 1.86 లక్షల మంది రైతులు మరణించగా.. వారి కుటుంబాలకు రూ.9,107 కోట్ల పరిహారం అందింది. ఇలాంటి మానవీయ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 14న చెల్లించాల్సిన రైతుబీమా ప్రీమియంను ఎల్ఐసీకి అందించలేదు. తద్వారా ప్రభుత్వం రైతుబీమాకు రాంరాం పలికి.. లక్షలాది రైతు కుటుంబాల ఉసురుపోసుకుంటున్నది.
కేసీఆర్ పాలనలో : ఎరువుల కొరత అనే మాట లేదు
ఏటా పంపిణీ చేసింది : దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నులు
ముందస్తు ప్రణాళికలు : సీజన్‌కు ముందే కేంద్రంతో మాట్లాడి దిగుమతి
కాంగ్రెస్ వచ్చాక : మళ్లీ చెప్పుల క్యూలు, పోలీసు పహారా, ధర్నాలు, రాస్తారోకోలు
ఇస్తున్నది ఎంత?: అరిగోస పడితే ఎకరానికి బస్తా
చేసిందేంది?: యూరియా యాప్ పేరిట మరింత గోస
ఉమ్మడి రాష్ట్రంలో యూరియాతోపాటు ఇతర ఎరువుల కోసం రైతులు పడ్డ గోస వర్ణనాతీతం. విక్రయకేంద్రాల వద్ద రాత్రి నిద్ర, క్యూలో చెప్పులు, పోలీసు పహారాలు, పోలీస్ స్టేషన్లలో పెట్టి విక్రయాలు, ధర్నాలు, రాస్తారోకోలు, లాఠీచార్జ్‌లు.. ఇలా సీజన్ మొదలైందంటే చాలు రాష్ట్రమంతటా పరిస్థితి భయానకంగా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం ఎరువుల కొరతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫలితంగా కొద్ది కాలంలోనే పరిస్థితి మారిపోయింది. ఎరువుల కొరత అనే మాట వినిపించకుండా చేశారు. చెప్పులు, పాస్ బుక్కుల క్యూలు, పోలీస్ పహారాలు బంద్ అ య్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 27 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేసేందుకే నానా బీభత్సం సృష్టించగా.. 2023 నాటికి కేసీఆర్ ప్రభుత్వం ఏటా సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలుగకుండా పంపిణీ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ ఎరువుల గోస మొదలైంది. మొదటి సీజన్ నుంచే అన్నదాతలకు అష్టకష్టాలు మొదలయ్యాయి. కలలో కూడా ఊహించని విధం గా.. మళ్లీ చెప్పుల క్యూలు, పోలీసుల పహారా, ధర్నాలు, రాస్తారోకోలు ప్రారం భం అయ్యాయి. క్యూలు కనిపించకుండా చేసే కుట్రలో భాగంగా యాప్‌లో యూరియా విక్రయాలను ప్రారంభించింది. నిరక్షరాస్యులైన, స్మార్ట్‌ఫోన్ లేని రైతుల కష్టాలు ఎంత చెప్పినా తక్కువే. ఒక్క యాప్‌తోనే వేగలేకపోతున్న రైతులపై.. ఇప్పుడు మరో యాప్‌ను మోపింది. కేంద్రంతో సంప్రదింపులు జరుపలేకపోవడం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ఎరువులకు నిధులు కేటాయించకపోవడం వల్లే యూరియా కష్టాలు వచ్చాయి.
హామీ: వరి ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్
అమలు : మొదట 37 రకాల సన్నాలకు మాత్రమే బోనస్
తాజా కొర్రీలు : సన్న రకాలను 7 రకాలకు కుదింపు
రైతులకు బకాయి : రూ.1,860 కోట్లు
మాట ఇవ్వడం, తప్పడం కాంగ్రెస్‌కు అలవాటు. దీనిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పదేపదే రుజువు చేస్తున్నది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ‘ధాన్యానికి బోనస్’ హామీ. ఎన్నికల సమయంలో అన్ని రకాల వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పి దగా చేసింది. నాలుగు సీజన్లలో రెండు సీజన్లు ఎగ్గొట్టింది. 2024-25 యాసంగిలో రూ.1,160 కోట్లు, 2025-26లో రూ.700 కోట్లు కలిపి మొత్తం రూ.1,860 కోట్లు ఎగ్గొట్టింది. అక్కడితో ఆగిపోలేదు.. ఇప్పుడు మరిన్ని కోతల కోసం కొత్త కొర్రీలు పెడుతున్నది. తొలుత 37 రకాల సన్నాలకు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా 30 రకాలను తొలగించింది. కేవలం 7 రకాలకే బోనస్ ఇస్తామని మరోసారి దగా చేసింది. అది కూడా విత్తనాలు కొనుగోలు చేసినట్టు రుజువు చూపిస్తేనే బోనస్ ఇస్తామని చెప్పి పూర్తిగా ఎగ్గొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.
రుణమాఫీ.. రైతులకు కుచ్చుటోపీ
హామీ : రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ
మొత్తం : రూ.31వేల కోట్లు
లబ్ధిదారులు : 42 లక్షల మంది
అమలు: రూ.25.35 లక్షల మందికి మాఫీ
చెల్లించింది : రూ.20,616 కోట్లు
ఎగవేత : రూ.10,384 కోట్లు
‘రైతులెవరూ బ్యాంకులకు పాత బాకీలు కట్టొద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్ 9న ఏకకాలంలో రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం’.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో పదేపదే రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇది. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ రైతులను దగా చేసింది. మొదట రూ.2 లక్షల లోపు రుణాలున్న రైతులు 42 లక్షలుగా తేల్చిన సర్కార్ వీరికి రూ.31 వేల కోట్లు అవసరమని నిర్ణయించింది. అయితే ఆ తర్వాత కేవలం 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణాలను మాఫీ చేసి మొత్తం పూర్తయినట్టు ప్రకటించింది. ఇంకా 16.65 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయకుండా రూ.10,384 కోట్లు ఎగ్గొట్టింది. ఆ తర్వాత నిలదీస్తే రూ.2 లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని రైతులు చెల్లిస్తే మిగిలిన రూ.2 లక్షలను ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. దీంతో రైతులు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి రూ.2 లక్షలకుపైన ఉన్న రుణాలను కూడా చెల్లించారు. అయినా వారికి నయా పైసా రుణమాఫీ కాలేదు.
కేసీఆర్ హయాంలో : ఊరూరా కొనుగోలు కేంద్రాలు..
రైతులకు భరోసా : గింజ కూడా మిగులకుండా తడిసిన ధాన్యం సైతం కొనుగోలు
కాంగ్రెస్ వచ్చాక : కేంద్రం అనుమతి ఇస్తేనే కొనుగోలు చేస్తామని ధోకా
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్లక్ష్యం
ఆర్థిక భారం నెపంతో కొనుగోళ్లు చేయొద్దని నిర్ణయం
రైతులు పండించిన ప్రతి పంటనూ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని, కొన్ని పంటలకు బోనస్ కూడా ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. బోనస్ సంగతి దేవుడెరుగు.. కొనుగోళ్లకే ఎగనామం పెట్టే కుట్రలకు తెరలేపింది. సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించింది. కొనుగోళ్ల కోసం కూడా రైతులు రోడ్లమీదికి రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు పంటల కొనుగోళ్లకు సంబంధించి సర్కార్ కీలక నిర్ణయం తీసకున్నది. ఇకపై కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన మేరకే కొనుగోలు చేస్తామని, అంతకు మించి గింజ కూడా కొనమని రాష్ట్ర క్యాబినెట్లోనే నిర్ణయించారు. పంటల కొనుగోలు ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందట! ప్రభుత్వానికి నష్టం వస్తుందట! అందుకే కొనుగోలు చేయొద్దని నిర్ణయించింది. ఇటీవల ధాన్యం, మక్కల కొనుగోలులో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
ప్రతిపక్షంలో ఉండగా వరి సాగుపై, ధాన్యం కొనుగోళ్లపై నానా యాగి చేసిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక రైతులను నిండా ముంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వరి సాగు చేయొద్దంటూ రైతులపై పిడుగు వేసింది. వరి సాగు చేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ ఆదేశాలిచ్చింది. ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము కూడా కొనుగోలు చేయలేమని చేతులెత్తేసింది.
24 గంటల సరఫరాకు మంగళం
కేసీఆర్ హయాంలో 24 గంటలు ఉచితం
కాంగ్రెస్ వచ్చాక 6-8 గంటలకు మించి నో
సాయంత్రం 5 నుంచి ఉదయం 5 వరకు వ్యవసాయ విద్యుత్తు బంద్
ఉమ్మడి రాష్ట్రంలో ‘కరెంట్ వస్తే వార్త’ అనేలా ఉండేది. కానీ కేసీఆర్ కృషితో తెలంగాణలో ‘కరెంట్ పోతే వార్త’ అనే పరిస్థితికి మారింది. కానీ మళ్లీ కాంగ్రెస్ రాకతో మరోసారి కరెంట్ వస్తే వార్త అనే పరిస్థితి ఏర్పడింది. దేశంలోనే మొటమొదటిసారిగా 2018 జనవరి 1 నుంచి రాష్ట్రంలో రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేశారు. అలా కేసీఆర్ హయాంలో వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పెడుతున్నది. వ్యవసాయానికి 6-8 గంటలకు మించి నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం లేదని రైతులు చెప్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి మళ్లీ ఉదయం 5 గంటల వరకు వ్యవసాయ విద్యుత్తును పూర్తిగా నిలిపేశారని మండిపడుతున్నారు. కరెంట్ కోతలతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్తు సరఫరాలో నాణ్యత లేకపోవడంతో బోరు, బావుల మోటర్లు కాలిపోతున్నయి. ఒకే సీజన్లో నాలుగైదుసార్లు కాలిపోయిన పరిస్థితులున్నాయని రైతులు చెప్తున్నారు. మోటర్లను బాగు చేయించేందుకు రైతులు రూ.వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తున్నది.
రైతు డిక్లరేషన్‌కు, సీఎం ఇచ్చిన హామీకి దిక్కులేదు
రెండేండ్లలో రూ.8 వేల కోట్లకు పైనే నష్టం
ఒక్కసారి రూ.51 కోట్లే మంజూరు..
మళ్లీ ఇంతవరకు అతీగతీ లేదు
‘వివిధ కారణాలతో రైతులు పంట నష్టపోతే వెంటనే పరిహారం అందేలా పంటల బీమా అమలు చేస్తాం’ అని ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించింది. రెండున్నరేండ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. ఏటా కేవలం రూ.3 వేల కోట్లు చెల్లించలేక పంటల బీమాను అమలు చేయడంలేదు. పోనీ.. నష్టనపోయిన రైతులకు నేరుగా పరిహారం చెల్లించడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి విలయానికి పంటలు కోల్పోయి నష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వక, పంటల బీమా లేక వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. గడిచిన రెండేండ్లలో అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా రైతులకు సుమారు రూ.8 వేల కోట్లు నష్టం వాటిల్లినట్టు అంచనా. అనధికారిక లెక్కల ప్రకారం సుమారు 25-30 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు అంచనాలున్నాయి. వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికీ రూ.10 వేల పరిహారం ఇస్తామంటూ ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ ఇచ్చిందేమీ లేదు. రెండున్నరేండ్లలో ఏడుసార్లు పంట నష్టం జరిగితే కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా రూ.51 కోట్లు మాత్రమే పరిహారం ఇచ్చింది. ఆ తర్వా త మళ్లీ ఆ ఊసెత్తడంలేదు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కామారెడ్డిలో పర్యటించి రైతులకు పరిహారం ప్రకటించారు. కానీ ఇప్పటివరకు రైతులకు పైసా విడుదల కాలేదు. మొంథా తుఫాను కారణంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వరంగల్‌లో సీఎం పర్యటించి, రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ప్రకటించారు. కానీ ఉత్తర్వులు కూడా ఇప్పటికీ వెలువడలేదు.
అప్పులబాధలతో అన్నదాతల ఆత్మహత్యలు
రైతు స్వరాజ్య వేదిక ప్రకారం : 625
ఇతర సంస్థల లెక్కలు : 1000 మంది
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవడంతో రైతులు పిట్టల్లా రాలిపోయేవారు. బీఆర్ఎస్ హయాంలో దున్నకం మొదలు పంట కొనుగోలు వరకు ప్రతి దశలో భరోసా ఇవ్వడంతో రైతుల మరణాలు తగ్గిపోయాయి. కానీ.. కాంగ్రెస్ ఏలుబడిలో మళ్లీ రైతుల మృత్యుఘోష మొదలైంది. ఓవైపు రైతు సంక్షేమ పథకాల రద్దు, మరోవైపు పంటల కొనుగోళ్లలో కొర్రీలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా భూముల విలువలు పడిపోవడంతో రైతుల్లో ఆత్మైస్థెర్యం దెబ్బతిన్నది. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో రియల్ ఎస్టేట్ పడిపోయి, భూములు అమ్ముడుపోక పిల్లల చదువులు, పెండ్లిళ్లకు అప్పులు చేస్తున్నారు. ఆ ఆప్పులు తీర్చే మార్గంలేక ఆత్మహత్యలే శరణ్యమంటూ తనువు చాలిస్తున్నారు. రైతుబీమా లెక్కల ప్రకారం కాంగ్రెస్ వచ్చిన తర్వాత సుమారు 700 మంది రైతులు మరణించారు. రైతుల సమస్యలపై అధ్యయనం చేసే రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం 625 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. ఇతర సంస్థలు, వార్త కథనాల ప్రకారం వెయ్యి మందికి పైగా రైతుల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.