Congress | రాజన్న సిరిసిల్ల, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ‘బోనస్ ఎగవేతకు కాంగ్రెస్ సర్కార్ మరో కుట్ర చేస్తున్నదా? అందులో భాగంగానే కొర్రీలు పెడుతున్నదా?’ అంటే అవుననే అంటున్నారు రైతులు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. రైతుభరోసా సక్రమంగా వేయకుండా.. పండించిన ధాన్యం కొనకుండా.. అరిగోస పెడుతున్న ప్రభుత్వం, వానకాలం సీజన్ వేళ వరి సాగుపై ఆంక్షలు విధిస్తున్నది. తాము చెప్పిన ఎనిమిది రకాలు సన్నాలు సాగు చేస్తేనే బోనస్ ఇస్తామని సంకేతాలు ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చినంక మెలిక పెట్టింది.
కేవలం సన్నరకం ధాన్యానికే బోనస్ అంటూ మాట మార్చింది. దీంతో రైతులు సన్నరకం ధాన్యం పండించేందుకు ఉత్సాహం చూపగా, యాసంగిలో పంటను కొనేందుకు ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పటికీ పెడుతూనే ఉన్నది. ప్రస్తుతం వానకాలం మొదలైన వేళ మరో ఎత్తుగడ వేసింది. రెండేండ్ల క్రితం 33 సన్నరకాలలో ఏది సాగు చేసినా బోనస్ చెల్లిస్తామని చెప్పగా.. తాజాగా కేవలం తాము చెప్పిన ఎనిమిది రకాల సన్నాలే సాగు చేసుకోవాలని, వాటికే బోనస్ ఇస్తామని పరోక్ష ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు.
సన్నరకం ధాన్యం పంటలపైనా ఆంక్షలు పెట్టడంతో సాగుకు వెనుకడుగు వేస్తున్నారు. ఎనిమిది రకాల విత్తనాలకు మార్కెట్లో డిమాండ్ ఉన్నదని, అధిక దిగుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా విశ్వసించలేకపోతున్నారు. అసలు సర్కార్ చెప్పిన సన్నరకాల విత్తనాలు మార్కెట్లలో దొరుకుతాయో.. లేదో? దొరికినా సాగు సమయంలో వచ్చే చీడలను తట్టుకుంటాయో.. లేదో? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దొడ్డురకం కాకుండా సన్నరకం సాగు చేస్తే పంట సమయం ఎక్కువ తీసుకుంటుందని, ఆరుగాలం శ్రమించినా దిగుబడి తక్కువగా వస్తున్నదని, అంత కష్టపడినా కొనేదిక్కుండదని మండిపడుతున్నారు. ఇవ్వలేక సాకులు అన్నట్టు బోనస్ ఇవ్వకుండా తప్పించుకునేందుకే సర్కార్ ఇలా కొర్రీలు పెడుతున్నదని విమర్శిస్తున్నారు. బోనస్ ఎగవేత కుట్రలో భాగంగానే సన్నాల సాగుపై ఆంక్షలు పెడుతున్నదని ఆగ్రహిస్తున్నారు. తమది రైతు సర్కార్ అని చెప్తున్న కాంగెస్ ప్రభుత్వం మొదటి నుంచి రైతు వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని నమ్మి నష్టపోయామని, ఇప్పుడు కూడా నమ్మితే నిండా మునుగుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం చెప్తున్న రకాలు ఇవే..
బీపీటీ-5204(సాంబమసూరి), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్-15048), కేఎన్ఎం-1638, జై శ్రీరాం, హెచ్ఎంటీ (సోనా), డబ్ల్యూజీఎల్-962, వరంగల్-44(సిద్ది), జేజీఎల్-1798 వంటి సన్నరకాలనే సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పంటలు వేసినవారికే బోనస్ ఇస్తామని ప్రకటించింది.
ఎన్నికల వేల ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. కేవలం సన్నరకం వడ్లకే ఇస్తమన్నరు. నేను వానకాలం, యాసంగిలో దొడ్డు రకం పండించిన. మంచి దిగుబడి వచ్చింది. ఈ సారి కూడా అవే వేయాలనుకున్నా. సర్కార్ సన్నరకాలే పండించాలంటున్నది. లేకుంటే వడ్లు కొనం.. బోనస్ రాదని చెప్తున్నరు.
– కొరవేని రమేశ్, అంకుసాపూర్, తంగళ్లపల్లి మండలం