Rythu Bharosa | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : యాసంగి రైతుభరోసా పెట్టుబడి సాయంపై మిగిలిన రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ సీజన్‌కు కూడా రేవంత్‌రెడ్డి సర్కారు ఎగనామం పెట్టినట్టేనా? అంటే ప్రభుత్వవర్గాలు అవుననే చెప్తున్నాయి. ఇప్పటికే యాసంగి సీజన్ ముగిసింది. మరో పది, పదిహేను రోజుల్లో వానకాలం ప్రారంభం కాబోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు ఇంకా యాసంగి రైతుభరోసా బకాయిలను ఇస్తుందనుకోవడం ఉత్త భ్రమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం వచ్చే వానకాలం సీజన్‌కైనా పెట్టుబడిసాయం ఇస్తుందో లేదోననే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ హయాంలో అడగకుండానే పెట్టుబడి సాయం అందేదని, ఇప్పుడు మొత్తుకున్నా ఇవ్వడం లేదని రైతులు చర్చించుకుంటున్నారు.
రైతుభరోసా పథకాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న అట్టహాసంగా ప్రారంభించింది. అదేరోజు 577 పైలట్ గ్రామాల్లో కొంతమంది రైతులకు పెట్టుబడి సాయం జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్చి 31వ తేదీ వరకు రైతులందరికీ రైతుభరోసా జమ చేస్తామని ప్రకటించారు. మార్చి 31 వెళ్లిపోయింది. ఏప్రిల్ పోయింది. మరో పది రోజులైతే మే 31 కూడా వస్తుంది. కానీ, ఇప్పటివరకు రైతులందరికీ రైతుభరోసా జమ కాలేదు. ఈ యాసంగి సీజన్లో ఏడు విడతల్లో మూడున్నర ఎకరాల వరకు మాత్రమే ప్రభుత్వం రైతుభరోసా నిధులు జమ చేసింది. యాసంగిలో మొత్తం 152 లక్షల ఎకరాలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.9,120 కోట్లు రైతులకు పంపిణీ చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు సుమారు 85 లక్షల ఎకరాలకు రూ.5,100 కోట్లు మాత్రమే జమ చేసినట్టు తెలిసింది. ఇంకా రైతులకు రూ.4,020 కోట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ఏమైందీ? రైతుభరోసా ఏమైం దీ? అంటూ రైతులు ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. మాయమాటలతో రైతులను మోసం చేసుడేనా? రైతు భరోసా ఇచ్చేది ఉన్నదా? అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘మీరంతా మమ్మల్ని క్షమించాలి. అనుకున్న సమయానికి రైతు భరోసా ఇవ్వలేకపోయాం. మిగిలినవారికి త్వరలోనే ఇస్తాం’ అంటూ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ వేదిక మీద చెప్పిన మాటలకు కూడా విలువ లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రైతులెవరూ ఊహించి ఉండరు.. రాష్ట్రంలో రైతుబంధు ఆగిపోతుందని! కానీ, కాంగ్రెస్ సర్కారు మాత్రం రైతుల నమ్మకాన్ని వమ్ము చేసింది. గత వానకాలం రైతు భరోసాను నిలిపివేసింది. రైతుబంధును సంస్కరిస్తామంటూ కమిటీలు, అభిప్రాయ సేకరణ, అధ్యయనాలు అంటూ కాలయాపన చేసింది. వానకాలం పెట్టుబడి సాయానికి సున్నం చుట్టింది. దీంతో కేసీఆర్ హయాంలో అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి నుంచి బయటపడ్డ రైతులు మళ్లీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దయనీయ స్థితిని చవిచూశారు. చివరకు ప్రస్తుత యాసంగి సీజన్ నుంచి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కారు ఆ మేరకైనా చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయింది.
తాము అధికారంలోకి వస్తే ఎకరాకు సీజన్‌కు రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15వేలు రైతుభరోసా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చాక రెండు సీజన్లలో రైతు భరోసాను అమలు చేయలేదు. మూడో సీజన్లో తగ్గించి అమలు చేసింది. నిజానికి, కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం 2023-24 యాసంగిలో 152 లక్షల ఎకరాలకు రూ.7,500 చొప్పున రూ.11,400 కోట్లు చెల్లించాలి. కానీ, ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.7,400 కోట్లు మాత్రమే చెల్లించింది. అంటే రూ.4వేల కోట్లు బకాయి పడింది. ఆ తర్వాత 2024-25 వానకాలంలో రైతులకు నయా పైసా ఇవ్వలేదు. అంటే రూ.11,400 కోట్లు బకాయి ఉన్నట్టే. ఇక ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు రూ.5వేల కోట్లు మాత్రమే చెల్లించింది. అంటే ఈ సీజన్లోనూ రూ.6,400 కోట్లు బకాయి పడింది. ఈ విధంగా మూడు సీజన్లకు కాంగ్రెస్ సర్కారు రైతులకు మొత్తంగా రూ.21,800 కోట్లు బకాయిపడింది. ఆ మేరకు రాష్ట్రంలో రైతుల ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది.
‘ఇప్పుడు తీసుకుంటే ముష్టి రూ.ఐదువేలే. అదే కాంగ్రెస్ సర్కారు వచ్చినంక రూ.15 వేలు వస్తయి’ ఇవీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుభరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి పలికిన ప్రగల్భాలు. రైతుబంధు కింద కేసీఆర్ సర్కారు ఇస్తున్న ఎకరానికి రూ.10 వేలను రూ.15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక ఒక విడతలో రూ.ఐదు వేలే ఇచ్చింది. మరో విడతలో పూర్తిగా ఎగనామం పెట్టింది. ఈ యాసంగి సీజన్లో తాము హామీ ఇచ్చినవిధంగా రూ.15వేలు కాకుండా ఎకరాకు రూ.12వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. యాసంగి సీజన్ ముగిసినా ఆ మాట కూడా నిలుపుకోలేని అసమర్థ ప్రభుత్వంగా రైతుల మనస్సుల్లో ముద్ర వేసుకుంటున్నది.