జనగామ, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పంట రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామలోని ఎస్బీఐ మున్సిపల్, నెహ్రూపార్ ఏరియా శాఖల ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. బ్యాంకులు సీజన్ ప్రారంభంలో పంట రుణాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తెచ్చి వ్యవసాయం చేసున్నారని తెలిపారు.
సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందించాలి ; అఖిల భారత రైతుసంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా
దమ్మపేట/జూలూరుపాడు, జూన్ 6 : ప్రభుత్వం వానకాలం సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత రైతు సంఘం (ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, జూలూరుపాడు తహసీల్ కార్యాలయాల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము, సహాయ కార్యదర్శి బానోత్ ధర్మా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ చేసి.. రైతులకు కొత్త రుణాలు అందించాలని, సబ్సిడీపై పనిముట్లు అందజేయాలని కోరారు. కల్తీ విత్తనాలు, ఎరువులతో నష్టపోవడంతోపాటు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం తహసీల్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.