తెలంగాణ రైతన్న తలెత్తుకొని, మీసం మెలేసే రోజు ఇది.. రైతు రాజ్యంలో బతుకుతున్నానని గుండె మీద చెయ్యేసుకొని చెప్పుకొనే సందర్భం ఇది.. 24 గంటల కరెంటు, పంట పెట్టుబడి, సాగు నీళ్లు అందుకొంటూ ఆనందపడుతున్న సుముహూర్తం ఇది.. పేరుపేరునా తెలంగాణ రైతన్నకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత చరిత్రలో అసలైన రైతు రాజ్యం ఎక్కడ అంటే.. యావత్తు దేశ రైతుల వేళ్లు తెలంగాణ వైపే చూపుతున్నా యి. కారణం.. ఇక్కడ రైతే రాజు. రైతు సంక్షేమమే సర్కారు ప్రధాన ఎజెండా. ఏటా రూ. వేల కోట్ల ఖర్చుతో వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, రైతు బాగు కోసం పరితపిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పడగానే రైతు సం క్షేమం, వ్యవసాయరంగంపైనే దృష్టి కేంద్రీకరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. విద్యుత్తు నుంచి సాగు నీటి వరకు ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వ చ్చారు. ఏ సర్కారుకూ సాధ్యం కాని రైతుబం ధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు వేదికలు, కల్లాలు, చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా 2014లో 1.34 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం.. 2.03 కోట్ల ఎకరాలకు పెరిగింది.
రైతుబంధు
రైతు బంధు కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 9 విడతల్లో రూ. 57,882 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. 10వ విడత నిధులు 7,600 కోట్లను నెలాఖరు నుంచి పంపిణీ చేయనున్నది.
రైతుబీమా
రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నది. ఇప్పటి వరకు 93,170 మంది రైతు కుటుంబాలకు రూ.4,658.50 కోట్లు బీమా రూపంలో అందించింది. ఆ ప్రీమియం కూడా రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
ధాన్యం సేకరణ
రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎనిమిదేండ్లలో రూ.1.20 లక్షల కోట్ల విలువైన 6.50 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
నకిలీ విత్తనాల సరఫరాపై పీడీ యాక్ట్
నకిలీ విత్తనాలు సరఫరాదారులపై దేశంలోనే తొలిసారిగా పీడీ యాక్ట్ అమలు చేస్తున్నది. 25 నకిలీ కంపెనీల యాజమానులపై పీడీ కేసులు పెట్టింది. 1,027 మందిని జైలుకు పంపించింది.
పాలకు రూ.4 ప్రోత్సాహకం
పాడి రైతులకు ప్రతి లీటరుపై రూ.4 ప్రోత్సాహకంగా అందిస్తున్నది. దీని కోసం ప్రభుత్వం 361.45 కోట్లు వెచ్చించింది.
గొర్రెల పంపిణీ
రూ.11 వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి 3.93 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేసింది. రెండో విడతలో రూ.6 వేల కోట్లతో మరో 3 లక్షల మందికి పంపిణీకి చర్యలు చేపట్టింది.
గొర్రెల్లో నట్టల నివారణ
గొర్రెలకు, మేకలకు ఫ్రీగా నట్టల నివారణ మందు వేయిస్తున్నది. ఇందు కు ఏటా రూ.10 కోట్లు వెచ్చిస్తున్నది.
రైతు వేదికలు
రైతులు పంటల సాగుపై చర్చించుకొనేందుకు ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా గుర్తించి ప్రతి క్లస్టర్‌కు ఒక రైతువేదికను నిర్మించింది. ఈ విధంగా రూ.572.22 కోట్లతో 2,601 రైతు వేదికలను నిర్మించింది.
చేపల పంపిణీ
ఈ పథకం ద్వారా రూ.395 కోట్లతో 473 కోట్ల చేపలు, రొయ్యలు నీటి వనరుల్లో వేసింది.
సాగునీటి ప్రాజెక్టులు
కాళేశ్వరంతోపాటు పెండింగ్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 1.50 లక్షల కోట్లు వెచ్చించింది.
పంట బీమా
2019-20 వరకు పంట నష్టపోయిన 20.98 లక్షల మంది రైతులకు రూ. 2,462.83 కోట్ల పరిహారం అందించింది.
ఉచిత విద్యుత్తు
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నది. ఏటా రూ.11 వేల కోట్ల ను చెల్లిస్తున్నది. మరమ్మతుల కోసం రూ.36వేల కోట్లు వెచ్చించింది.
రుణమాఫీ
రుణమాఫీ కింద 17,351 కోట్లను రుణాలు మాఫీ చేసిం ది. 40.73 లక్షల మంది రైతు లకు లబ్ధి చేకూరింది.
ఇన్పుట్ సబ్సిడీ
దెబ్బతిన్న పంటలకు 37.62 లక్షల మందికి 1,325 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించింది.
సంచార పశు వైద్యశాలలు
100 అంబులెన్స్‌లతో పశువులకు వైద్యం అందిస్తున్నది. ఏటా 40 కోట్లు వెచ్చిస్తున్నది.
నీటి తీరువా పన్ను రద్దు
రైతులకు నీటి తీరువా పన్నును రద్దు చేసిం ది. రూ.800 కోట్ల బకాయీ రద్దు చేసింది.
ట్రాక్టర్లపై పన్ను రద్దు
ట్రాక్టర్లపై పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. రూ.550 కోట్ల బకాయి రద్దు చేసింది.
డ్రిప్ పథకం
రూ.2 వేల కోట్లతో 3.50 లక్షల ఎకరాలకు సబ్సిడీ డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
కల్లాల నిర్మాణం
రైతులు పంటలు ఆరబెట్టుకొనేందుకు రూ. 750 కోట్లతో 89 వేల కల్లాలను నిర్మిస్తున్నది.