హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పాలన వల్లే ఇప్పటికీ కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పీ శ్రీహరి రావు పేర్కొన్నారు. గన్ పార్క్ వద్ద శ్రీహరి రావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రైతుల పట్ల చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. ఈ మధ్య కాలంలో రైతుల లాభం కోసం కాంగ్రెస్ ఒక్క నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. స్వామినాథన్ కమిషన్ నివేదికను అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి ఉంటే.. ఇప్పుడు రైతులకు కష్టాలు ఉండేవి కావన్నారు. ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ చేయలేదని ధ్వజమెత్తారు. పంటలకు కనీస మద్దతు ధరలను చట్టబద్దం చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యమైందన్నారు.
తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకున్నదే ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులేనని శ్రీహరిరావు ధ్వజమెత్తారు. చెరువులను, కుంటలను కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతు చేయలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకుంటాం అని సీఎంగా వైఎస్సార్ జీవో విడుదల చేసి అమలు చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ 10 ఏండ్ల పాలనలో వ్యవసాయాన్ని నిర్జీవంగా చేశారని ధ్వజమెత్తారు. రైతులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీనే రైతు సంఘర్షణ సభ పెట్టడం విడ్డూరంగా ఉందని శ్రీహరి విమర్శించారు.