హైదరాబాద్, సెప్టెంబర్8 (నమస్తే తెలంగాణ) : ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను పెంచేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయశాఖ కార్యదర్శి, ఆ దేశ క్యాబినెట్ సభ్యుడు ఫ్రాన్సిసో పీటు లారెల్ జూనియర్‌తో మంగళశారం ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. భారీ మొత్తంలో నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసే సామర్థ్యం తెలంగాణకు ఉన్నదని తెలిపారు. బియ్యం కొనుగోలు అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎగుమతికి అనువైన ఉత్పత్తులు, నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటురంగ ప్రతినిధులతో కలిసి పరిశీలిస్తామని తెలిపారు. డిసెంబర్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొనాలని కార్యదర్శి లారెల్ను ఉత్తమ్ ఆహ్వానించారు.
హైదరాబాద్, సెప్టెంబర్8 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్-2026’ను నిర్వహిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎఫ్డీసీ ఎండీ ముకుందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, సెట్విన్ మాజీ చైర్మన్ గిరిధర్‌రెడ్డితో కలిసి చాలెంజ్ పోస్టర్‌ను మంగళవారం ఆవిషరించారు. షార్ట్ ఫిల్మ్‌లు, పాటలు, వీడియోలతో యువత ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ చాలెంజ్ వేదికగా నిలుస్తుందని తెలిపారు.