హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తేతెలంగాణ)/మేడ్చల్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి కలియుగ దుశ్శాసనుడని, గౌరవ సభను కౌరవ సభగా మార్చిన ఘనత ఆయనకే దక్కిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి గొంతుపిసికి, సునీతాలక్ష్మారెడ్డి చీరలాగి మహిళా లోకాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దాడికి గురైన మహిళా ఎమ్మెల్యేలపైనే రివర్స్‌లో కేసులు పెట్టారని మండిపడ్డారు. స్పీకర్ అంటే గౌరవం ఉన్నదని చెప్పినా తమ సభ్యుడిని అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు.
దళితులపై కాంగ్రెస్‌కు నిజంగా ప్రేముంటే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది..? అంబేద్కర్ విగ్రహానికి తాళాలెందుకు వేశారు? అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని పోలీసులు పరిశీలిస్తారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పడం ఆక్షేపణీయమని మండిపడ్డారు. సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిపై దాడి ఘటనలో ఎలాంటి విచారణ జరుపకపోవడం బాధాకరమని విమర్శించారు. స్పీకర్ అంటే ఎంతో గౌరవమున్నదని, వ్యక్తిగతంగా ఉన్న అభిమానం స్పీకర్ మనసుకూ తెలుసునని పేర్కొన్నారు. తాతామధు స్పీకర్‌ను ఏం అనలేదని, ఒకవేళ నొచ్చుకొని ఉంటే పార్టీ తరఫున కూడా విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.
కేసీఆర్ ఇంటిపై దాడి వికృత చర్య
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిపై కాంగ్రెస్ శ్రేణుల దాడి వికృత చర్య అని హరీశ్‌రావు మండిపడ్డారు. జవహర్‌నగర్ పీఎస్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాణిక్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలవుతాయనే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని దుయ్యబట్టారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ మీడియాతో చిట్‌చాట్ చేసి మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరుగలేదనడం ఏంది? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ సభ్యులు ప్లకార్డులు తీసుకువెళ్తే అడ్డుకోలేదని, తాము టీ షర్ట్లు వేసుకుంటే అడ్డుకున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ మైత్రీ బంధానికి ఇదే నిదర్శనమని స్పష్టంచేశారు. రాష్ర్టానికి హోంమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి మహిళా ఎమ్మెల్యేలపై దాడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకొ ని రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు. రాష్ట్ర పరిస్థితులపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
వీర్లపల్లి శంకర్ సభ్యత్వం రద్దు చేయాలి
కేసీఆర్ చావాలని మాట్లాడిన కాంగ్రెస్ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సభలో సీఎం తర్వాత ఆ స్థానం ప్రతిపక్ష నాయకుడిదే అని, అలాంటి నాయకుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
నల్లబ్యాడ్జీలతో సభకు..
అసెంబ్లీ సమావేశాల రెండో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం సభ ప్రారంభంకాగానే బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానాన్ని ప్రస్తావించారు. మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీతక్క సైతం బీఆర్ఎస్పై ఎదురు దాడికి దిగారు.