హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మంగళవారం మండలిలో ఆందోళన చేపట్టారు. సభ్యుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సభను స్తంభింపజేశారు. సభ్యుల నిరసనలు, నినాదాలతో మండలి హోరెత్తింది. చైర్మన్ పోడియం ముందు బైఠాయించి ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు.
మీడియాపై ఆంక్షలేల?
రాష్ట్ర శాసనసభ సమావేశాల కవరేజీకి వెళ్లే మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే రాంనారాయణ విచారం వ్యక్తం చేశారు. శాసనసభలో మీడియా కూడా ఒక భాగమనే విషయాన్ని ప్రభుత్వం మరువరాదని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.