హైదరాబాద్, ఫిబ్రవరి 25 : వ్యవసాయాభివృద్ధికి విత్తనమే ఆయువుపట్టు అని, నాణ్యమైన విత్తనం లేకుండా వ్యవసాయ అభివృద్ధి సాధ్యంకాదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయాభివృద్ధి జరగాలన్నా, అధిక దిగుబడి రావాలన్నా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని తెలిపారు. రాజేంద్రనగర్‌లో ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతో నిర్మించిన తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాన్ని పరీక్షించడానికి తెలంగాణ వేదిక కావడం గర్వంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ విత్తన పరీక్ష కేంద్రానికి అంతర్జాతీయ సంస్థ అనుమతి లభించడం గొప్ప విషయమని తెలిపారు. తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఎఫ్ఏవో తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా ప్రకటించిందని గుర్తు చేశారు. విత్తన సంస్థలకు తెలంగాణ కేరాఫ్‌గా మారిందని తెలిపారు.
కోటి ఎకరాల్లో పంటలు
సీఎం కేసీఆర్ తీసుకున్న రైతు అనుకూల విధానాల వల్ల తెలంగాణలో ప్రతి ఇంచు భూమి సాగవుతున్నదని, ప్రస్తుతం కోటి ఎకరాలకు పైగా పంటలు పండుతున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సాగునీటి గోస తీరిందని, వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి ఎదిగామని వెల్లడించారు. తెలంగాణ ఒకప్పుడు మెట్ట పంటలే ఉండేవని, నేడు అన్నిరకాల పంటలు పండుతున్నాయని తెలిపారు. పత్తి సగటు దిగుబడిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని, వరి దిగుబడిలో పంజాబ్‌ను మించిపోయామని చెప్పారు. ప్రపంచంలో విత్తన రంగంలో ఎక్కవ ప్రాసెసింగ్‌కు అవకాశం ఉన్న నగరం హైదరాబాద్ అని తెలిపారు. ఇక్కడి నుంచి సుమారు 70-80 దేశాలకు విత్తనాలను సరఫరా చేస్తున్నామని, ఈ నేపథ్యంలో విత్తన పరీక్ష కేంద్రం అవసరం మరింత పెరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.