హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్‌ను సమర్థంగా నియంత్రించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలు ఎక్సైజ్ అధికారులపై దాడులకు పాల్పడుతున్నాయని, వీటిని ఉపేక్షించబోమని, దాడులను అరికట్టేందుకు ఎక్సైజ్‌శాఖకు ఆయుధాలు అందించాల్సిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టంచేశారు. ఈ అంశం పరిశీలనలో ఉన్నదని, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను సోమవారం మంత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యసేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
సౌమ్య ఆరోగ్య పరిస్థితి, ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. సౌమ్యకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని మంత్రి స్పష్టంచేశారు. గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో సౌమ్య తెగువ.. విధులపై ఆమెకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మంత్రి వెంట ఎక్సైజ్‌శాఖ అదనపు కమిషనర్ ఖురేషీ, నిజామాబాద్, మెదక్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు సోమిరెడ్డి, హరికిషన్ ఉన్నారు.
దుండగులపై చర్యలు తీసుకోవాలి : ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై గంజాయి స్మగ్లర్ల దాడిని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం ఖండించింది. ఈ మేరకు అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సౌమ్యపై దాడి అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి నిజామాబాద్‌లో సౌమ్యకు తక్షణ వైద్య సహాయం అందేలా కృషి చేసిన అధికారులకు, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలు మంజూరు చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠికి కృతజ్ఞతలు తెలిపారు. దుండగులపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.