Ex Minister Niranjan Reddy | సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం బాధ్యత వహించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. గోటితో పోయే సమస్యలను గొడ్డలిదాకా తెస్తున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జీవిత చరమాంకంలో ఉన్న సాయిరెడ్డి ఇంటికి దారిలేకుండా గోడకట్టి ఏం సాధించారు ? అని నిలదీశారు.
పశువుల దవాఖానా పేరుతో ఇంటికి దారిలేకుండా గోడకట్టడంతో సీఎం సొంతూరు వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సాయిరెడ్డి ఆత్మహత్యకు కారకులైన వారందరి మీదా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో మనుషుల ప్రాణాలకు, వారి ఆకాంక్షలకు విలువ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.