హైదరాబాద్, 27 (నమస్తేతెలంగాణ): అలవికానీ హామీలిచ్చి అమలు చేయకుండా ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై ఉద్యోగులు రణన్నినాదం చేశారు. హైదరాబాద్ సహా 31 జిల్లా కేంద్రాల్లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. మార్చిలోగా బకాయిలు విడుదల చేయకుంటే ప్రభుత్వం మెడలు వంచుతామని ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ వేదికగా నిర్వహించిన మహాధర్నాకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ (టీజీఈజాక్) రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం 31 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భారీ ర్యాలీలుగా తరలివచ్చి కలెక్టర్ కార్యాలయాల ఎదుట బైఠాయించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ‘ఓపీఎస్ ముద్దు.. సీపీఎస్ వద్దు, పీఆర్సీ వేయండి.. డీఏలు ఇవ్వండి..’ అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నింగినంటేలా నినదించారు. వెంటనే పీఆర్సీ వేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ఉద్యోగుల ఆగ్రహజ్వాలల్లో మాడిమసై పోతారని హెచ్చరించారు. ఇప్పటికైనా కండ్లుతెరిచి ఉద్యోగులకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతంచేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ ఇందిరాపార్ ధర్నాచౌక్ వేదికగా ఉద్యోగులు గురువారం తెలంగాణ ఉద్యోగ జేఏసీ (టీజీఈజాక్) ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాలో వేలాది మంది పాల్గొన్నారు. ఉద్యోగులు తమ విధులను బహిషరించి ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ కండ్లుతెరిచి మార్చిలోగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అన్నిరకాల బకాయిలు, డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. హైదరాబాద్‌లో మహా ధర్నా కార్యక్రమం టీజీఈజేఏసీ హైదరాబాద్ నగర చైర్మన్ కటూరి శ్రీకాంత్, కన్వీనర్ గండూరి వెంకటేశ్, హైదరాబాద్ జిల్లా చైర్మన్ విక్రమ్, కన్వీనర్ కృష్ణాయాదవ్, రంగారెడ్డి జిల్లా చైర్మన్ వూటు యశ్వంత్, కన్వీనర్ రామారావు నేతృత్వంలో జరిగింది.
కార్యక్రమంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, సహదేవ్, డాక్టర్ హరికృష్ణ, శ్రీరామ్‌రెడ్డి, వెంకటరమణ, ఖాదర్, మంజులారెడ్డి, శైలజ, ఉమా రెడ్డి, వరలక్ష్మి, స్వరూపలక్ష్మి, అపరంజిత, అమరేందర్, నరసింహస్వామి, రాజు, అవినాశ్, విజయ్, మహేశ్‌గౌడ్, రాజ్‌కుమార్, కుతాడి శ్రీనివాస్, నరేందర్, కొండల్‌రెడ్డి, బాల్‌రాజ్, రాజు, ఆశన్న, మల్లికార్జున్‌రెడ్డి, పూనం, పేరయ్య, గౌస్, డాక్టర్ జోషి, సత్యనారాయణ, దేవేందర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలన్నింటినీ 100 రోజుల్లోగా చిటికెలో పరిషరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇచ్చిన హామీలు.. మూడేండ్లు కావస్తున్నా నీటి మూటలుగా మారాయని టీఎన్జీవో చైర్మన్ మారం జగదీశ్వర్ విమర్శించారు. హైదరాబాద్ మహాధర్నాలో ఆయన మా ట్లాడుతూ.. మాట తప్పడంలో ప్రభుత్వం పీహెచ్డీ చేసిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ గురువారం నుంచి ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుయ్యారని టీజేఏసీ సెక్రటరీ, తెలంగాణ గెజీటెడ్ ఆపీసర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా, అదేనెల 10న ‘చలో హైదరాబాద్’ మహా నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఎన్నో కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదురొంటున్నాయని టీజాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలోనే ఏకకాలంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, అదీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బగరి శ్యామ్ ధ్వజమెత్తారు.