వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. అనస్వర రాజన్ కథానాయిక. మహేశ్ ఉప్పల దర్శకుడు. అక్టోబర్ 30న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘రష్మికను తెలుగుతెరకు పరిచయం చేసినందుకు గర్వంగా ఉండేది. ఇప్పుడు అనీష్ని పరిచయం చేస్తున్నందుకు అంతే గర్వపడుతున్నా. తను ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. దర్శకుడు మహేశ్ చాలా టాలెంటెడ్. తను చెప్పిన కథ తెరపై చూసినప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది.
అనస్వర రాజన్ ఈ సినిమాకు ప్రధాన బలం. సాంకేతికంగా కూడా సినిమా రిచ్‌గా ఉంటుంది’ అని తెలిపారు. ఇది తాను తెలుగులో సైన్ చేసిన తొలి సినిమా అని, అందుకే ఈ సినిమా తనకు ప్రత్యేకమని, ఇందులో ‘కీర్తి’ పాత్రను ఎంజాయ్ చేస్తూ పోషించానని, ఈ పాత్రలో ఉండే అమాయకత్వం, హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చేశానని అనస్వర రాజన్ చెప్పారు. అవకాశం ఇచ్చిన నిర్మాతకు దర్శకుడు మహేశ్ ఉప్పల కృతజ్ఞతలు చెప్పాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇదని ఆయన తెలిపారు. ఇంకా హీరో అనీష్, మాసనశర్మ కూడా మాట్లాడారు.