సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పశువులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అపహరించడంతో పాటు అర్ధరాత్రి వేళల్లో సెల్‌ఫోన్ దుకాణాల షట్టర్లు లేపి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ సిటీ పోలీసులు, టాస్క్‌ఫోర్స్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. చోరీ సొత్తును కొనుగోలు చేస్తూ బంగ్లాదేశ్‌కు అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు.
ఈ ముఠాకు చెందిన 9మందిని అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితులు తెలంగాణ వ్యాప్తంగా 13 పశువుల దొంగతనాల కేసుల్లోనూ, ఖమ్మం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మొబైల్ దుకాణాల చోరీ కేసుల్లోనూ ప్రమేయం కలిగి ఉన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు ఈ అంతర్జాతీయ చోరీ మొబైల్ నెట్‌వర్క్‌ను ఎలా ఛేదించామో తెలిపారు. నిందితుల నుంచి 15 మొబైల్ ఫోన్లు, మూడు కార్లు, 22లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పండుగల సమయంలో పశువుల దొంగతనాలు!
లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన మహ్మద్ తబ్రేజ్, మహ్మద్ రఫిక్‌లు పశువుల దొంగతనం చేసే వారని సీపీ తెలిపారు. రంజాన్, బక్రీద్ పండుగల సమయంలో నిందితులు పశువుల దొంగతనాలకు పాల్పడ్డారని, నాగర్‌కర్నూల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, ఫ్యూచర్‌సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా పశువులను చోరీ చేసేవారని చెప్పారు. పశువులను సులభంగా తరలించడానికి వాటి ఎత్తుకెళ్లే సమయంలో అవి అరవకుండా ఉండడానికి జైలాజైన్ అనే మత్తు ఇంజెక్షన్‌ను ఉపయోగించి వాటిని వాహనాల్లో ఎక్కించుకుని తరలించేవారన్నారు. దీని కోసం జుబేర్ అక్తర్, నవీద్, సాయిరెడ్డిలతో కలిసి ముఠాగా ఏర్పడగా అందులో సాయి రెడ్డి అనే వ్యక్తి ఈ ఇంజక్షన్లను సరఫరా చేసేవాడని వెల్లడించారు. ఈ ముఠా పశువులను ఎత్తుకెళ్లే సమయంలో వాహనాలను చంచల్‌గూడ జైలులో పరిచయమైన అబూ అనే వ్యక్తి సమకూర్చేవాడు.
ముంబై నుంచి బంగ్లాదేశ్‌కు వయా కోల్కత్తా..!
చోరీ చేసిన మొబైల్ ఫోన్లను విక్రయించడంలో కొందరు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. తబ్రేజ్ ముఠా నుంచి చోరీ చేసిన మొబైల్ఫోన్లను జాహేద్ ఖాన్ అలియాస్ రాజుభాయ్ తన అనుచరుల ద్వారా ముంబై నుంచి కోల్‌కతాకు పంపిస్తాడు. అక్కడి నుంచి వాటిని అక్రమంగా సముద్రమార్గం ద్వారా బంగ్లాదేశ్‌కు పంపి అక్కడి నుంచి మొబైల్‌ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తేలింది. జాహేద్ఖాన్ కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన మొబైల్ఫోన్ల దొంగల నుంచి కొంత కాలంగా మొబైల్ఫోన్లు కొనుగోలు చేసి వాటిని బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ప్రతీనెలా సుమారు 500 మొబైల్ఫోన్లు బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నారని తెలిసింది.
వీటిని బంగ్లాదేశ్‌కు చెందిన ఖాసీం అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడిందని సీపీ తెలిపారు. చోరీకి గురైన మొబైల్ ఫోన్లను విదేశాలకు తరలించడం ద్వారా వాటి ఐఎంఈఐ నెంబర్లను ట్రాక్ చేయడం కష్టతరమయ్యేలా ఉండేదని,ఈ వ్యవహారంలో హవాలా మార్గాల్లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. తబ్రేజ్ ముఠా తాజాగా కొత్తవోక్స్వ్యాగన్ కారులో హైదరాబాద్‌కు వచ్చి ఆగస్ట్ 17న హైదరాబాద్‌లో మొబైల్ దుకాణంలో చోరీకి నిందితులు పథకం సిద్ధం చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ యాదేందర్, ఎస్సై డీ రవిరాజ్, ఎస్సై జీ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పశువుల దొంగతనాల నుంచి మొబైల్ చోరీలకు..
రంజాన్, బక్రీద్ పండుగలు ముగిసిన తర్వాత పశువుల కొనుగోలుకు డిమాండ్ తగ్గడంతో వారు ఇతర చోరీలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తబ్రేజ్ తన పాత అనుచరుడు ఫరహాన్ను సంప్రదించగా అతను మొబైల్ ఫోన్ల షాపులను టార్గెట్ చేసి ఫోన్లను చోరీ చేస్తే వాటిని కొనుగోలు చేసే ముఠాలు తనకు టచ్‌లో ఉన్నట్లు చెప్పడంతో నిందితులు మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. తబ్రేజ్, రఫీక్, ఫర్హాన్ జూన్ 11న ఈ ముగ్గురు ఖమ్మంలోని సోనో విజన్ మొబైల్ షాపులో చోరీకి పాల్పడ్డారని సీపీ తెలిపారు. చోరీ చేసిన మొబైల్ ఫోన్లను మధ్యవర్తుల ద్వారా మెహబూబ్షేక్, ముబీన్షేక్ ద్వారా జావీద్ఖాన్కు సుమారు రూ.20 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్లో మరో మొబైల్ షాపు వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసు పెట్రోలింగ్ రావడంతో తప్పించుకునే క్రమంలో నిందితుల వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది.