ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యజమాని మార్క్ జుకెర్ బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా ఛాన్ ఓ చేపల చెరువుని కాపాడేందుకు నడుంకట్టారు. ఆరు వందల ఏళ్ల నాటి చెరువు కట్ట పునరుద్ధరణ కోసం ఏకంగా అయిదు మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. హవాయి ద్వీపాల్లోని అతి పెద్ద వాటిల్లో నాలుగోది అయిన కువాయిలో ‘మెనెహునే ఫిష్‌ల్యాండ్’ అనే చెరువు ఉంది. ఆ చెరువు చుట్టూ ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టిన రాతి గోడ ఉంది. ఆ చెరువు చుట్టూ బోలెడు కథలున్నాయి. ఆ గోడను ఎవరో ఒక రాత్రికి రాత్రే కట్టారనే కట్టు కథల నుంచి అదృశ్య శక్తులు నిర్మించాయని, దానికి ఏవో శక్తులున్నాయని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు.
ఒకటిన్నర మైలు పొడవు ఉన్న రాతి గోడ చాలాచోట్ల శిథిలమైంది. ఆదాయం పెద్దగా లేదని, నిర్వహణ భారం మోయలేమని నిర్వాహకులు దాన్ని అమ్మకానికి పెట్టారట. అమ్మకం ప్రకటన చూసి దీనిని కాపాడండి అంటూ వందల మంది స్థానికులు ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చేపల వేటతో ఎన్నో కుటుంబాలకు ఆదరువుగా నిలుస్తున్న చెరువును కాపాడాలన్న స్థానికుల విన్నపం జుకర్‌బర్గ్ సతీమణి ఛాన్ చెవిన పడింది. దానిని కాపాడేందుకు సిద్ధపడింది. నాలుగు మిలియన్ల డాలర్లతో ఆ చెరువుని కొనుగోలు చేయడానికి ఈ దంపతులు ముందుకువచ్చారు.
అయినా దానిని సొంతం చేసుకోవాలనే ఆలోచన వాళ్లకు లేదట. స్థానికంగా పనిచేస్తున్న ట్రస్ట్ ద్వారా చెరువు సంరక్షణ చేపట్టి, ప్రజలకే దక్కేలా చేస్తామని ఛాన్ పేర్కొంటున్నారు. ప్రిస్కిలా ఇప్పుడే కాదు ఇంతకుముందూ ఇలాంటి సేవా కార్యక్రమాలెన్నో చేపట్టింది. దశాబ్దం క్రితం ఓ పాఠశాలను స్థాపించింది. ట్యూషన్ ఫ్రీ కాన్సెప్ట్‌తో నడిపింది. చదువే కాదు విద్యార్థులకు దంత పరీక్షలు, కంటి పరీక్షలు, మానసిక వైద్యం అందించడం ఇవన్నీ ఈ పాఠశాలే చూసుకునేది. రెండు క్యాంపస్‌లలో నిర్వహించిన ఆ పాఠశాలను దశాబ్ద కాలం నడిపేందుకు భారీగానే డబ్బు ఖర్చు చేశారు. హవాయిలోని బీచ్‌ల సంరక్షణ, ఐర్లాండ్‌లోని పురానత కోట సంరక్షణ కోసం కూడా మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. ఈ సేవా కార్యక్రమాల కోసం ఛాన్ జుకెర్‌బర్గ్ ఇనిషియేటివ్ అనే సేవా సంస్థను స్థాపించింది.