హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ఇతర జేఏసీ నేతలు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనేక ఉద్యోగ అనుకూల నిర్ణయాలు తీసుకున్నారని జేఏసీ కొనియాడింది.
ప్రధానంగా రెండు డీఏలు మంజూరు, ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను క్యాబినెట్లో ఆమోదించడం, తెలంగాణ ఉద్యోగుల జేఏసీకి చాలా ఆనందాన్ని కలగజేసిందని పేర్కొన్నారు. ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని, వా టినీ ప్రభుత్వం త్వరలోనే ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.