హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను విస్మరిస్తే ఊరుకునేది లేదని, సమస్యల పరిష్కారం కోసం ఉవ్వెత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లంతా కలిసి తమ డిమాండ్ల సాధన కోసం ఏకమైనట్టు చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, టీజీపీఎస్సీ (టీఎన్జీవో) మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు విఠల్, మాజీ ఎమ్మెల్సీ
పాతూరి సుధాకర్‌రెడ్డి, టీఎన్జీవో మాజీ ప్రెసిడెంట్ కారం రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో పాటు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ‘తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ (టీఈసీసీ)’ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ
సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉగ్యోగులమంతా జేఏసీగా ఏర్పడి ఉద్యమాలు చేసినం.. దాని ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో మీరు పదవులు అనుభవిస్తున్నరు’ అని దుయ్యబట్టారు.
తెలంగాణ సాధనే ఎజెండాగా చేసిన ఉద్యమాల్లో తామంతా జైలు పాలు కావాల్సి వచ్చిందని గుర్తుచేశారు. సాగరహారం, సమర భేరి, సడక్‌బంద్, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటివి నిర్వహించి ఆయా కార్యక్రమాల్లో తామెంతో చురుగ్గా పాల్గొన్నామని చెప్పారు. దేనికీ భయపడకుండా రాష్ట్ర సాధనే లక్ష్యంగా ముందుకు సాగామని, అలాంటి పోరాట పటిమ ఉన్న తెలంగాణ ఉద్యోగులను ఉద్దేశించి సీఎం స్థాయిలో ఉన్న వాళ్లు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం, ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం వంటి ప్రయత్నం చేయడం ఏ మాత్రం సమంజసం కాదని హితవు పలికారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పీఆర్సీ, డీఏలు ఇవ్వకుండా, తామే స్వయంగా జీపీఎఫ్ రూపంలో దాచుకున్న డబ్బులతోపాటు రిటైర్మెంట్ పొందిన 10 వేల మంది పెన్షనర్ల బెనిఫిట్లను నిలిపి వేస్తే.. వారంతా ఎలా బతకాలని నిలదీశారు.
తాము అడుగుతున్నది గొంతెమ్మ కోర్కెలు కాదని, తమ హక్కులనే అడుగుతున్నామని వివరించారు. ఇప్పటి వరకు 5 డీఏలను నిలిపివేసిన ఘనమైన చరిత్ర దేశంలో ఒక్క తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కరోనా వంటి మహమ్మారి విజృంభించినా ఉద్యోగులను కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, వారికి సకాలం లో జీతాలిచ్చి, దాదాపు 40 వేల మందికి ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి కోట్లాడిన ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని ఎందుకు చూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ప్రశ్నించారు. ఉద్యోగులను, ప్రజలను వేరు చేయాలని సీఎం కుట్రలు చేస్తున్నారని, ఇది దుష్ట పన్నాగమని
మండిపడ్డారు. ‘ఏ పథకాలను నిలిపివేసి తమరు మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నరు? ఏ పథకాన్ని రద్దు చేసి ఫోర్త్‌సిటీని కొత్తగా నిర్మిస్తున్నరు? ఏ పథకాన్ని నిలిపివేసి అందాల పోటీ లు నిర్వహిస్తున్నారో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పి తీరాలి’ అని నిలదీశారు. కొత్తగా ఏర్పాటైన సమన్వయ కమిటీ ఏ ఒక్క
రాజకీయ పార్టీతో ముడిపడి లేదని వివరించారు. కమిటీలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్తోపా టు అన్ని పార్టీల సభ్యులు భాగస్వాములుగా చేరినట్టు తెలిపారు. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమపై బురదజల్లే ప్రయ త్నం చేయడం విడ్డూరమని మండిపడ్డారు.
ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం, సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిని నిలదీయడం కోసం ఉద్దేశించిన తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు విఠల్ స్పష్టం చేశారు. తెలంగాణ నేపథ్యంలో ఏర్పాటైన ఉద్యోగుల జేఏసీకి
ప్రతిరూపంగా ఈ కమిటీ ఏర్పాటైందని పేర్కొన్నారు. ఇందులో ఉన్న సభ్యులంతా బయటి వాళ్లు కాదని, అలుపెరుగని పోరాటాలు, ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించిన వాళ్లని పునరుద్ఘాటించారు. ఉద్యోగులతో పాటు పెన్షనర్లను సైతం తక్కువ చేసి చూడొద్దని హితవుపలికారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగుల తో చర్చించకుండా చోద్యం చూస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించడంలో తాత్సా రం చేస్తున్నారని, ఉద్యోగుల జీతాలకు, సంక్షేమ పథకాలతో ముడిపెట్టి, ప్రజల ముందు ప్రభుత్వ ఉద్యోగులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేయడం సరికాదని దుయ్యబట్టారు.
ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకుంటే సర్కారుపై సమరం తప్పదని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. పెన్షనర్లకు రెండేండ్ల నుంచి బెనిఫిట్లు ఇవ్వకుండా వారిని తిరిగి బద్నాం చేస్తున్నారని, 10 వేల మంది పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో ఉద్యోగుల కడుపు రగిలిపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం ఏర్పాటైన సమన్వయ కమిటీతో ఉద్యోగులకు బలం వచ్చినట్టయిందని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలు ఎవరూ వేరు కాదని, అంతా ఒక్కటేనని స్పష్టంచేశారు. తమకు రావాల్సిన 5 డీఏలతో పాటు పీఆర్సీ కూడా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది, వాటి గురించి ప్రజలకు వివరించేది, వాటిని సక్రమంగా అమలు చేసేది ఉద్యోగులేనని అలాంటి వారిని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా
సీఎం తమ పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని, తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ మాజీ అధ్యక్షుడు భుజంగరావు, లక్ష్మణ్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు రాజేందర్, జీఎన్జీవో మాజీ జనరల్ సెక్రెటరీ హమీద్, టీఆర్టీయూ మాజీ ప్రెసిడెంట్ జీ మోహన్‌రెడ్డి, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సునీతాఆనంద్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు ఎస్ చలపతిరావు, రిటైర్డ్ ఉద్యోగులు ఎస్ నరేందర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, టీఎన్జీవో ట్రెజరర్ ఎం విక్రమ్, డీ బాల్‌రెడ్డి, కే శ్రీనివాసరావు, జీ విష్ణుమోహన్‌రావు, కే రంగరాజు, జీ వెంకట్‌రెడ్డి, సంగారెడ్డి నుంచి వీ విజయలక్ష్మి, వరంగల్ నుంచి హసన్, మెదక్ నుంచి ఎల్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
‘కాల్చుకు తిన్నా.. కోసుకుతిన్నా జీతాలివ్వడానికి డబ్బులు లేవు, జీతాలివ్వడం కోసం ఏ సంక్షేమ పథకాన్ని నిలిపి వెయ్యిమంటారో చెప్పండి’ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, ఇందులో ప్రజలకు, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టే కుట్ర దాగి ఉన్నదని తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ మండిపడ్డారు. ప్రొఫెసర్ కోదండరాం, చిన్నారెడ్డిలతో ఏర్పాటు చేసిన కమిటీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. రిటైర్మెంట్ పొందినవారికి బెనిఫిట్లు అందక వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని వాపోయారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీలపై
ఈడీ కేసు పెడితే ఇదే కాంగ్రెస్ వాళ్లంతా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయలేదా ? అని నిలదీశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం తాము నిరసనలు తెలిపితే ఎందుకు తప్పో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.