హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విద్యావ్యవస్థలో లోపాలు వెక్కిరిస్తుంటే, విద్యార్థులు నిత్యం సమస్యలతో నలిగిపోతుంటే విద్యాశాఖ మాత్రం అవేమీ పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి చదువుపై దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి ప్రజాధనాన్ని సొంత చదువు కోసం భారీగా ఖర్చు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత నైపుణ్యం పెంచుకోవడం కోసం ప్రభుత్వ ఖజానాకు కన్నం వేయడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనవరి 25 నుంచి 30 వరకు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. హార్వర్డ్ కెన్నడీ సూల్లో నిర్వహించిన ‘లీడర్ షిప్ ఫర్ ది 21 సెంచరీ’ (21వ శతాబ్దపు నాయకత్వం) అనే వ్యక్తిగత నాయకత్వ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వ్యయాన్ని విద్యాశాఖ ఖాతా నుంచి చెల్లించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు (జీవో 5) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్కు చెందిన కరీం అన్సారీ అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సీఎం హార్వర్డ్ పర్యటన ఖర్చులు విద్యాశాఖ నిధుల నుంచే చెల్లించారని సచివాలయం కూడా ధ్రువీకరించింది. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామనే సాకుతో, సీఎం తన వ్యక్తిగత కోర్సుల కోసం ప్రభుత్వ నిధులు వినియోగించుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణకే నిధులు కరువయ్యాయనే ఆరోపణలు వస్తున్న తరుణంలో సీఎం పర్యటనకు ఈ స్థాయిలో నిధులు వాడటం దారుణమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.