చింతలమానేపల్లి, జూలై 23 : చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్-1 గ్రామపంచాయతీలో గురువారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఆకస్మిక తనిఖీ చేసి రికార్డుల నిర్వహణ లోపాలు, నిధుల వినియోగంలో అవకతవకలపై కార్యదర్శితో పాటు సర్పంచ్, మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రనగర్-1 గ్రామపంచాయతీలో అన్ని రికార్డులు అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శి భాసర్ను ప్రశ్నించారు. పాత కార్యదర్శి ఆడిట్ కోసం తీసుకెళ్లినట్లు తెలుపగా రికార్డులు ఎలా బయటకు ఇచ్చావని నిలదీశారు.
ఆడిట్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఎన్నికల ఖర్చు కోసం జీపీ ఫండ్ ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఎంపీడీవో సంతకం ఉండడంతో తాను చెల్లించానని సర్పంచ్ సూరజ్ దాస్ బదులిచ్చారు. ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి జీపీ డబ్బులు జమ చేయడంపై మండిపడ్డారు. స్ట్రీట్ లైట్ల బిల్లులో గతేడాది రూ. 1,400 ఉన్న ఒకో బల్బ్ ధర, ఈ ఏడాది రూ. 1,750కు పెంచి పేమెంట్ చేయడంపై కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పనులు చేయకుండానే సుమారు రూ.8.70 లక్షలు ఎలా డ్రా చేశారని ప్రశ్నించగా కార్యదర్శి సమాధానం ఇవ్వలేదు.
ఎంబీ బుక్ లు చూపెడుతూ జేఈ జీవన్ ఈ బిల్లులు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఇష్టారాజ్యంగా జీపీ రికార్డులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత బిల్లులు, చెల్లింపు రిజిస్టర్లను స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ దవాఖాన పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. మార్కెట్లో చెత్తా చెదారం పేరుకపోవడంపై కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ వేస్ట్ పారబోసిన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. కూరగాయల సంత స్థలం కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పిల్లలు రాకపోయినా అటెండెన్స్ ఎలా నమోదు చేస్తున్నారని అంగన్వాడీ టీచర్ మౌనికను ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్, లైటింగ్ సౌకర్యాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ, వైద్యుడు రాజ్ కుమార్, అధికారులున్నారు.