Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) రాష్ట్ర సంపద (జీఎస్డీపీ) 9.2% వృద్ధి చెందింది. ఇది 8.2 శాతంగా ఉన్న జాతీయ సగటు వృద్ధిరేటు కంటే 1% అధికం. తద్వారా దేశంలో అత్యధిక ఆర్థిక వృద్ధిరేటు సాధించిన 10 పెద్ద రాష్ర్టాల జాబితాలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రూ.7.9 లక్షల కోట్ల వాస్తవిక జీఎస్డీపీతో దేశంలో తొమ్మిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
రూ.15.7 లక్షల కోట్ల జీఎస్డీపీతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న తమిళనాడు నిరుడు 8.2 శాతం వృద్ధిరేటును సాధించగా.. ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న రాజస్థాన్ 8 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఈ మూడు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి సేవల రంగమే ప్రధాన కారణం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో 63% వాటాను కలిగివున్న సేవల రంగం నిరుడు 11% వృద్ధిరేటును సాధించింది. రూ.24.1 లక్షల కోట్ల జీఎస్డీపీతో దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న మహారాష్ట్రతోపాటు తమిళనాడులో నిరుడు సేవల రంగం వృద్ధిరేటు 9 శాతానికే పరిమితమైంది.
ఎల్నినో ప్రభావం వల్ల నిరుడు చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం వృద్ధిరేటు తగ్గినట్టు ‘ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్’ సీనియర్ ఆర్థిక విశ్లేషకుడు పారస్ జస్రాయ్ తెలిపారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి సేవల రంగంతోపాటు రియల్ ఎస్టేట్ రంగాలు.. తమిళనాడు ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాలు దోహదపడినట్టు పేర్కొన్నారు. 2020-23 వరకు మాంద్యాన్ని ఎదుర్కొన్న తయారీరంగం కూడా 2024లో పుంజుకున్నట్టు చెప్పారు.