హైదరాబాద్, అక్టోబర్23(నమస్తే తెలంగాణ): తెలంగాణవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,285 వేల దరఖాస్తులు అం దాయి. వాటి ద్వారా రూ.2,858 కోట్ల ఆదా యం సమకూరింది. ఈ మేరకు గురువారం తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 29,430 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా అదిలాబాద్ జిల్లాలో 4,013 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. గత నెల 27న టెండర్ నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 18 నాటికి దరఖాస్తుల గడువు ముగిసింది.
దరఖాస్తుదారుల వినతి మేరకు గురవారం వరకు ప్రభుత్వం గడువును పొడిగించింది. ఈ మేరకు ఈ నెల 27న డ్రా ద్వారా మద్యం దుకాణాల లైసెన్స్‌లను ఖరారు చేయనున్నారు. నిరుడు దాదాపు 1.32 లక్షల దరఖాస్తులు రాగా, రూ.2,641 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ సారి తక్కువ దరఖాస్తులే వచ్చినా, దరఖాస్తు రుసుంను పెంచడంతో ఎక్సైజ్ శాఖ రాబడి పె రిగింది. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది రూ.218 కోట్లు అదనంగా వచ్చినట్టు ఎక్సైజ్ వర్గాలు ప్రకటించాయి. గడువు పొడిగింపు తర్వాత దాదాపు 4,000 దరఖాస్తులు అదనంగా వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
ఏపీకి చెందిన మహిళా వ్యాపారులు అధిక మొత్తంలో అనూహ్యంగా దరఖాస్తుల ను సమర్పించినట్టు తెలిపారు. మద్యం దుకాణాల గడువు పొడిగింపును వ్యతిరేకిస్తూ వ్యాపారులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. నిర్దేశించిన గడువు ముగిసిన త ర్వాత ఏకపక్షంగా పొడిగించడంతో లాటరీ పద్ధతిలో ఎంపిక విధానం కావడంతో లైసెన్స్ ఖరారు ప్రక్రియ తారుమారు అవుతుందని వ్యాపారులు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను నేటికి వాయిదా వేసింది.
హైడ్రా కూల్చివేతలు మద్యం వ్యాపారంపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని, కనీసం 30 శాతం వ్యాపారులు దూరం అవుతారని ముందే పసిగట్టిన ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పన్నిన వ్యూహం ఎట్టకేలకు ఫలించినట్టు ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. డిమాండ్ ఉన్న ప్రాంతానికి 82 మద్యం దుకాణాలను ముందుగానే తరలించినట్టు చెప్తున్నారు. ఆ దుకాణాలకే భారీగా టెండర్లు వచ్చినట్టు ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాటు దరఖాస్తు ధర పెంచడంతోపాటు పొరుగు వ్యాపారుల రాక కోసం వేసిన వ్యూహం ఫలిం చడంతో ఆదాయం సమకూరిందని చెప్తున్నా రు.