హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): రుణమాఫీ కింద ప్రభుత్వం బ్యాంకులకు రూ.18 వేల కోట్లు అందజేస్తే, రైతులకు ఇప్పటివరకు రూ.7,500 కోట్లు మాత్రమే చేరాయని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రుణాల మాఫీలో వారం ఆలస్యమైనా ఫలితం ఉండబోదని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే, ఆ పత్రికా ప్రకటన తప్పు అంటూ ఆయన పీఆర్వో సాయంత్రం మ రో ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వం బ్యాంకులకు రూ.18 వేల కోట్లు జమ చేస్తే.. తిరిగి రైతులకు కొత్త రుణాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నాయనేది భట్టి విక్రమార్క ఉద్దేశం అంటూ ఆయన పీఆర్వో వివరణ ఇచ్చారు.
సీజన్ ప్రారంభమైనప్పటికీ17, 300 కోట్లు మాత్రమే రుణాలు ఇవ్వడం సరైంది కాదని భట్టి అన్నారని పేర్కొన్నారు. రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు. మంగళవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు రుణాల విషయంలో బ్యాంకర్లు లెక్కలతో కాదు, ఆత్మతో వ్యవహరించాలని సూచించారు. తమ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రుణమాఫీ, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించడంతోపాటు భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.
వ్యవసాయంతోపాటు పారిశ్రామిక రంగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తున్నదని, ఇన్నోవేటివ్ పాలసీలతో ముందుకు వెళ్తున్నదని వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి రూ.36 వేల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని, వీరికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సూచించారు. ఇందిరా మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్లు వడ్డీ లేని రుణాల రూపంలో ఇవ్వనున్నామని, వారికి సహకరించాలని కోరారు.
రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ, సహకారాలను అందిస్తుందని చెప్పారు. రాబోయే త్రైమాసికంలో నిర్దేశించిన రుణ ప్రణాళికను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కష్టకాలంలో కూడా ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తూ రూ.18 వేల కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని గుర్తుచేశారు. కింది స్థాయిలో పనిచేసే బ్రాంచ్ మేనేజర్లు రుణ ఖాతాలో తప్పులు సరిదిద్ది రైతులకు మేలు చేయాలని కోరారు. బ్యాంకర్లు బాధ్యతగా వ్యవహరించి రుణమాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలని సూచించారు. అంకెలు చదువుకొని మూడు నెలలకోసారి మీటింగ్‌లు పెట్టడం వల్ల, బ్యాంకర్ల సదస్సు నిర్వహణకు అర్ధంలేదని చెప్పారు.