కరువులో రాష్ట్రం.. విందుల్లో సీఎం!
రాష్ట్ర ప్రజలు కరువు కోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఫైవ్‌స్టార్ హోటళ్లలో విందు, వినోదాల్లో మునిగి తేలుతున్నారనే విమర్శలొస్తున్నాయి.
- గ్లోబల్ సమ్మిట్ పేరిట ఫైవ్‌స్టార్ హోటళ్లలో విందులు, వినోదాలు
- మొన్న ఫలక్‌నూమా ప్యాలెస్‌లో నిన్న ఢిల్లీ తాజ్ ప్యాలెస్‌లో..
- విందుల కోసం వందల కోట్లు ఖర్చు
- కరువు కాలంలో వస్తయో రాని పెట్టుబడుల కోసం వృథా ఖర్చు
- రైతులకు మాత్రం నిధుల్లేవని సాకులు
- ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ
- 81వ సారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలు కరువు కోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఫైవ్‌స్టార్ హోటళ్లలో విందు, వినోదాల్లో మునిగి తేలుతున్నారనే విమర్శలొస్తున్నాయి. రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చేందుకు పైసా లేదంటున్న ప్రభుత్వం.. విందులకు మాత్రం రూ.వందల కోట్లు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వస్తాయో రాని పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ పేరిట విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరువు కాలంలో రాష్ర్టాన్ని, రైతాంగాన్ని గాలికొదిలేసి గ్లోబల్ సమ్మిట్ పేరుతో విచ్చలవిడితనం చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఫైవ్‌స్టార్ హోటళ్లలో విందులు
పెట్టుబడుల కోసమంటూ డిసెంబర్ 7,8,9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కర్టన్ రైజర్ ఈవెంట్ల పేరిట పెద్ద పెద్ద హోటళ్లలో వేడుకలు నిర్వహిస్తున్నది. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రక్ష ఎక్స్పో పేరిట, తాజాగా గురువారం ఢిల్లీలో మరో పెద్ద హోటల్ తాజ్ ప్యాలెస్‌లో కార్యక్రమాలు నిర్వహించారు. వీటిని అంగరంగ వైభవంగా నిర్వహించడం గమనార్హం. ఈ రెండు కార్యక్రమాల నిర్వహణ, అతిథుల విడిది, విందు కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేశారనే విమర్శలున్నాయి.
వాస్తవానికి ఒకవైపు డిసెంబర్ 7 నుంచి 9 వరకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలు నేరుగా గ్లోబల్ సమ్మిట్‌కే వస్తారు. వారిని గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని పిలిచేందుకు పెద్ద పెద్ద హోటళ్లలో భారీ ఖర్చుతో కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, నిధుల కొరత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆడంబరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ దుబారా ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంట నష్టానికి పైసల్లేవ్… విందులకు మాత్రం వందల కోట్లు
కాంగ్రెస్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో సాగునీళ్లు కరువై, కరెంటు కోతలతో వ్యవసాయం ఆగమైంది. పంటలు ఎండిపోయి రైతులు భారీగా నష్టపోతున్నారు. పరిహారం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం నయా పైసా పరిహారం ప్రకటించలేదు. కనీసం రైతులకు భరోసా కూడా ఇవ్వడంలేదు. రైతులకు పంట నష్ట పరిహారం ఊసెత్తని సర్కార్.. రూ.వందల కోట్లు ఖర్చు చేస్తూ ఫైవ్‌స్టార్ హోటళ్లలో గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.
81వ సారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి 81వ సారి ఢిల్లీకి వెళ్లారు. డిసెంబర్ 7,8,9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ సన్నాహక కార్యక్రమాన్ని గురువారం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలని పలువురు ఇన్వెస్టర్లను కోరారు. తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు ప్రభుత్వ సహకారం, పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హాజరై తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలోని ఫార్మా, అంతరిక్షం, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, ఆహారశుద్ధి, పరిశోధనలు, ఆవిష్కరణ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ సంజయ్ జాజు తదితరులు ప్రసంగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

