TS IPASS | తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పారిశ్రామికవేత్తల ఇబ్బందులు చెప్పనలవికాకుండా ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కరెంటు కోతలే ఉండేవి. కరెంటు కోతలు ఏటా పెరుగుతూ చివరికి 2014 నాటికి వారానికి మూడురోజుల పవర్ హాలిడేల వరకు వచ్చాయి. వారంలో మూడు రోజులు మాత్రమే కరెంటు సరఫరా ఉండేది. అదికూడా ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు మాత్రమే. నెలలో 15 రోజులు మాత్రమే పరిశ్రమలు నడిచేవి. దీంతో లేబర్ సరిగా పనికి వచ్చేవారు కాదు. దీంతో పరిశ్రమలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. అప్పుడున్న పాలకులను పారిశ్రామికవేత్తలు ఎన్నిసార్లు కలిసి కరెంటు ఇవ్వాలని కోరినా ఫలితం లేదు. రాజధాని నగరంలో ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. చార్జీలు ఎంత పెంచినా కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, కరెంటు కోత లేకుండా చూడాలని వారు మొత్తుకున్నా ఆ వేదన అరణ్య రోదనే అయ్యింది.

అవినీతి కారణంగా ముందుకురాని పరిశ్రమలు…
ఉమ్మడి రాష్ట్రంలో కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నాలుగు దశాబ్దాల క్రితం బాలానగర్, జీడిమెట్ల, ఉప్పల్, నాచారం, వీఎస్టీ, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన పారిశ్రామికవాడలే తప్ప కొత్తగా ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)ని ఏర్పాటు చేసినా కొత్త పారిశ్రామికవాడను అభివృద్ధి చేయలేదు. సెజ్‌ల పేరుతో ప్రభుత్వ భూములను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారు. భూములు తీసుకున్నవారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. భూ కుంభకోణాలతో ఏపీఐఐసీ తరచూ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కేది. వోక్స్ వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొస్తే, పాలకులు పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శించడంతో ఆ కంపెనీ వెనక్కిపోయింది. కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఖాదీ గ్రామోద్యోగ్, ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన వంటి కేంద్ర పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఉంటూ కొనసాగించేది. 25 శాతం సబ్సిడీ కోసం ఏండ్లపాటు చెప్పులరిగేలా తిరుగుతూ, సబ్సిడీలో సగానికిపైగా డబ్బులు లంచాల రూపంలో సమర్పించాల్సి వచ్చేది.
10 వేలకుపైగా పరిశ్రమల మూత..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో సుమారు 60,000 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, మరో 500 వరకు మధ్యతరహా పరిశ్రమలు ఉండేవి. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు మూడు లక్షల మంది పనిచేసేవారు. కరెంటు కోతల నేపథ్యంలో పరిశ్రమలు నడవక ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం మానేశారు. కొన్ని పరిశ్రమలు సగం జీతమే ఇచ్చేవి. దాదాపు 10 వేల వరకు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. మరోవైపు, రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల ఒత్తిడి, కస్టమర్లకు సకాలంలో సరుకులు సరఫరా చేయలేకపోవడం వంటి ఇబ్బందులు ఉండేవి. దీంతో పరిశ్రమలు మూసేయడం తప్ప మరో మార్గమే లేదు. ఆటోమొబైల్స్ ఉత్పత్తులకు సంబంధించిన ఫౌండ్రీ ఇండస్ట్రీకి హైదరాబాద్ పెట్టింది పేరు. కరెంటు కోతలతో ఫౌండ్రీ ఇండస్ట్రీస్ సకాలంలో అందించకపోవడంతో ఆర్డర్లు ఇవ్వడం మానేశారు. ఆర్డర్లు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. దీంతో ఇకడి ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. 2014లో విద్యుత్ డిమాండు 6,500 నుంచి 7,000 మెగావాట్లు కాగా, రాష్ట్రంలో 4,500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుపై పాలకులు నిర్లక్ష్యం వహించారు.
పనులు దొరక్క కార్మికుల ఆత్మహత్యలు…
కార్మికులకు పరిశ్రమల్లో పనిలేక, గ్రామాలకు వెళ్లి పని చేసుకుందామంటే అకడ కరెంటు, నీళ్లు, పంటలు పండక నానా ఇబ్బందులు పడ్డారు. పిల్లలను చదివించుకోలేక, పెండ్లీడుకొచ్చిన పిల్లలకు పెండ్లి చేయలేక, అప్పుల బాధలతో నిత్యం కుటుంబాల్లో గొడవలు జరిగేవి. అనేక మంది కార్మికులు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో పాల్గొన్న తెలంగాణ పారిశ్రామికవేత్తల కంపెనీలకు కార్పొరేట్ సంస్థల నుంచి ఆంధ్రా పెట్టుబడిదారుల లాబీ.. ఆర్డర్లు రాకుండా చేసింది.

రాష్ట్రం ఏర్పాటైన నాలుగు నెలల్లోనే కరెంటు సమస్య అంతం…
రాష్ట్రం ఏర్పాటైన నాలుగు నెలల్లోనే పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇవ్వడం మొత్తం దేశాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. 2014లో కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి మరీ నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. దేశంలో ఎకడ కరెంటు అందుబాటులో ఉంటే అక్కడి నుంచి కొనుగోలు చేయడమే కాకుండా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. గతంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన విద్యుత్ రంగానికి అత్యధిక నిధులు కేటాయించారు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసమే సుమారు రూ.30 వేల కోట్లు కేటాయించారు.
6,837 కోట్ల సబ్సిడీ, 90 వేల మందికి లబ్ధి
పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తున్నది. దాదాపు 56 కొత్త పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసి సబ్సిడీ ధరకు భూములను కేటాయిస్తున్నది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే కాకుండా జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం చిన్నతరహా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. 2023-24 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.4,037 కోట్లు కేటాయించారు. వివిధ రాయితీలకు రూ.3,519 కోట్లు కేటాయించారు. 2014-15 నుంచి 2022-23 వరకు దళిత, గిరిజన, దివ్యాంగులకు రాయితీలు కల్పించేందుకు ఉద్దేశించిన టీ-ప్రైడ్, జనరల్ కేటగిరీ వారికి సంబంధించి టీ-ఐడియా పథకాల ద్వారా ప్రభుత్వం రూ.6,837 కోట్లు విడుదల చేయగా, సుమారు 90,000 మంది లబ్ధి పొందారు. విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా సుమారు రూ.9,500 కోట్ల వరకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించింది.
పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ
పారిశ్రామిక అనుకూల విధానాలతో తెలంగాణ పేరు ప్రఖ్యాతులు విశ్వవ్యాప్తం అయ్యాయి. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా నిలుస్తున్నది. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ర్టానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనేక అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతున్నాయి. భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని భావించే ఏ అంతర్జాతీయ పరిశ్రమ అయినా ముందుగా తెలంగాణను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూఏఈ, యూఎస్, యూకే, జర్మనీ తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడమే ఇందుకు నిదర్శనం. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం విశేషం.
టీఎస్ ఐపాస్‌తో మారిన పారిశ్రామిక ముఖచిత్రం…
టీఎస్ఐపాస్తో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సింగిల్ విండో పద్ధతిలో నెల రోజుల్లోనే అనుమతులిస్తున్నారు. నిరంతర విద్యుత్తు, శాంతిభద్రతలు, సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం పరిశ్రమలకు వరంగా మారాయి. ఐటీ రంగంలో తెలంగాణ నేడు బెంగళూరును అధిగమించింది. ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రాష్ర్టానికి క్యూ కట్టాయి. స్నేహపూర్వక విధానాలతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు 24,241 పరిశ్రమలకు అనుమతులు జారీ చేయగా, రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు, 22.5 లక్షల ఉద్యోగావకాశాలు సమకూరాయి.
పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు…

నాడు
ఎటుచూసినా అంధకారం. పవర్ హాలిడేలతో ఇబ్బంది పడ్డ పరిశ్రమలు, రాని ఆర్డర్లు. బిల్లులు కడతామన్నా కరెంటు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాలు. కొత్త పరిశ్రమలకు లేని చేయూత. కుంభకోణాలకు కేరాఫ్‌గా మారిన ఏపీఐఐసీ. ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినా ఆమ్యామ్యాల బాధలు. దివాలా తీసిన పారిశ్రామిక రంగం. ఇదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పారిశ్రామిక రంగ పరిస్థితి.
ఆ రోజుల్లో జనరేటర్ లేని పరిశ్రమ లేదంటే అతిశయోక్తి కాదు. జనరేటర్లతో ఉత్పాదక ఖర్చు భారీగా పెరిగింది. ఒక యూనిట్ కరెంటు వాడకంతో రూ.8 ఖర్చయితే, జనరేటర్ వాడడంతో రూ.12 నుంచి 15 వరకు ఖర్చయ్యేది. ఒకవైపు విద్యుత్ ఇవ్వకపోగా, మరోవైపు ఇవ్వని విద్యుత్‌కు కూడా నెలవారీ చార్జీల పేర పరిశ్రమల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు.
2014కు ముందు పరిశ్రమల పరిస్థితి…
2014కు ముందు ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు -సుమారు 12,000
పారిశ్రామిక రంగానికి కేటాయించిన సగటు బడ్జెట్ -రూ.300 కోట్లు
పరిశ్రమల ఏర్పాటుకు అందించిన ప్రోత్సాహకాలు (2014-15) -రూ.200 కోట్లు
పరిశ్రమలకు రోజుకు ఇచ్చిన కరెంటు సగటున 5 గంటలు
కరెంటు లేక మూతపడిన పరిశ్రమలుసుమారు 10,000
పారిశ్రామిక రంగంలో ఎంత మందికి ఉపాధి -6,64,000
నేడు
24 గంటల నిరంతర విద్యుత్తు. నూతన పారిశ్రామికవాడల అభివృద్ధి. ప్రభుత్వం తరఫున విరివిగా రాయితీలు. చేయి తడపాల్సిన పనిలేకుండా సింగిల్ విండో పద్ధతిలో సత్వర అనుమతులు. సమస్యలు తీర్చేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పరిశ్రమల మంత్రి. ఇదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మార్పు. ‘టీఎస్ ఐపాస్’తో సర్కార్ దిల్వాలా అనిపించుకున్నది. తొమ్మిదిన్నరేండ్లలో కార్ఖానా రంగం ముఖచిత్రమే మారింది.
కొత్త పరిశ్రమలు
ముచ్చర్ల ఫార్మాసిటీ, వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్, సంగారెడ్డి మెడికల్ డివైజెస్ పార్, సుల్తాన్పూర్ మహిళా పారిశ్రామికవాడ, దండుమలా పూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్, చందన్ వల్లి ఇండస్ట్రియల్ పార్, ఇబ్ర హీంపట్నం ఫైబర్ గ్లాస్ కాంపో జిట్ క్లస్టర్, మహేశ్వరం ఎలక్ట్రా నిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ తదితరాలు.
సొంత రాష్ట్రంలో మారిన స్థితిగతులు…
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతిచ్చిన పరిశ్రమలు -24,000
పారిశ్రామిక రంగానికి కేటాయించిన బడ్జెట్ (2023-24) -రూ.5,000 కోట్లు
తొమ్మిదిన్నరేండ్లలో పరిశ్రమలకు అందించిన ప్రోత్సాహకాలు -రూ.9,500 కోట్లు
పరిశ్రమలకు రోజుకు ఇస్తున్న కరెంటు 24 గంటలు
కరెంటు లేక మూతపడిన పరిశ్రమలు -0
పారిశ్రామిక రంగంలో ఎంతమందికి ఉపాధి సుమారు 22.5 లక్షలు