Mallu Bhatti Vikramarka | ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28: అర్హత ఆధారంగానే అందరికీ ఆరు గ్యారెంటీలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజకీయాలకతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా భట్టి మాట్లాడారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఇందిరమ్మ పాలనకు ప్రజలు శ్రీకారం చుట్టారని, వారి నమ్మకాన్ని నిజం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్టు పేర్కొన్నారు.
మిగిలిన నాలుగు గ్యారెంటీలను కూడా ప్రజా పాలన కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా గ్రామ సభలు నిర్వహించి, దరఖాస్తులు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ దరఖాస్తులన్నింటిని భద్రపరిచి, త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హులను గుర్తిస్తామని తెలిపారు. గురువారం నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ప్రతి దరఖాస్తును పరిశీలిస్తామని, రశీదు ఆధారంగా తమ దరఖాస్తు ఎక్కడుందో తెలుసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతుభరోసా వంటి పథకాలను అందిస్తామని చెప్పారు. దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రతి గ్రామంలో వంద కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటుచేశామని, ప్రతి కౌంటర్‌కు అధికారులను నియమించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, కలెక్టర్ గౌతమ్ పోట్రు, స్పెషల్ ఆఫీసర్ సౌమ్య పాల్గొన్నారు.