హైదరాబాద్, మే 24 (నమస్తేతెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ పరీక్ష ఆదివారం జరగనున్నది. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు అధికారు లు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:45 గంటలు, మధ్యాహ్నం 2:45 గంటలకే పరీక్ష కేంద్రాల గేట్లు మూసేస్తామని అధికారులు ప్రకటించారు. ఇన్నాళ్లు డిమాండ్ లేక డీలా పడిన డీఈఎల్ఈడీ కోర్సుకు ఇప్పుడు ఊహకందనంత డిమాండ్ పెరిగింది.
ఈ ఏడాది డీఈఈసెట్కు 43,616 మంది దరఖాస్తు చేశారు. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు డీఈఎల్ఈడీ కోర్సు పూర్తిచేసిన వారే అర్హులు కావడంతో దరఖాస్తులెక్కువ వచ్చాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిరుడు మొత్తం 3,600 సీట్లుండగా, 50% సీట్లు కూడా నిండలేదు. మొదటి విడతలో 1,063, రెండో విడతలో 325 మంది విద్యార్థులు మాత్రమే సీట్లు పొంది కాలేజీల్లో రిపోర్ట్చేశారు. డిమాండ్ లేక కాలేజీలు క్రమంగా మూతబడుతున్నాయి.