యాదాద్రి భువనగిరి/హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో పదోతరగతి విద్యార్థినుల మృతి కేసులో ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. హాస్టల్ వార్డెన్ శైలజను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హన్మంతు కే జెండగే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విపక్షాల ఆందోళనలతో నేపథ్యంలో స్పందించిన సర్కారు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కోసం మహిళా శిశుసంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ (స్కీమ్స్) కేఆర్ఎస్ లక్ష్మీదేవిని విచారణాధికారిగా నియమించింది.
ఈ నెల 3న రాత్రి భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో భవ్య, వైష్ణవి అనే పదోతరగతి విద్యార్థులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆటో డ్రైవర్ ఆంజనేయులు, హాస్టల్ వంట మనిషిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఓ వైపు పోలీసులు దర్యాప్తు చేపడుతుండగా, మహిళా శిశు సంక్షేమశాఖ జేడీ లక్ష్మీదేవి మంగళవారం వసతి గృహాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినుల ఆత్మహత్యపై ఆలస్యంగానైనా తమ డిమాండ్‌కు స్పందించి దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ఎమ్మెల్సీ కవిత ‘ఎక్స్’ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌ను ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఉదయం సందర్శించారు.