హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) అరుదైన ఘనత సాధించింది. కేవలం నాలుగు నెలల్లోనే సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులకు రూ.31.29 కోట్లను తిరిగి చెల్లించింది. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) ద్వారా సమన్వయం చేసుకొంటూ.. చర్చల ద్వారా సైబర్ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రెండు మెగాలోక్ అదాలత్‌ల ద్వారా రూ.31.29 కోట్ల మొత్తాన్ని బాధితుల ఖాతాల్లో జమ చేయించింది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 457 కింద పిటిషన్ దాఖలు చేసే ప్రక్రియను కూడా మరింత సులభతరం చేసింది. ఇందుకు ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ను తయారు చేసి, గత ఫిబ్రవరి 20 అన్ని జిల్లాల లీగల్ సర్వీసెస్ అథారిటీలకు, ఎస్పీలకు, సీపీలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పంపింది. వాటి ప్రకారం పిటిషన్ దాఖలు చేసిన వారందరికీ.. వారి అకౌంట్లో స్తంభింపజేసిన నగదును పూర్తిగా ఇప్పించారు. ఆ నిర్ణయం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 5,142 పిటిషన్లు ఆయా కోర్టుల్లో దాఖలయ్యాయి. వాటిని ఒక్కోదాన్ని పరిష్కరించే క్రమంలో రూ.31.29 కోట్లను పంపిణీ చేశారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే నగదు బదిలీకాకుండా అడ్డుకుంటారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ తెలిపారు.