హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): బంగారం కంపెనీ ఐపీఓకి వచ్చిందని, పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశచూపి.. ఓ వ్యక్తి నుంచి రూ.5.40 కోట్లను లూటీ చేసిన ఇద్దరు అన్నదమ్ములను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) అధికారులు అరెస్టు చేసినట్లు శనివారం సీఎస్బీ డైరెక్టర్, డీజీ శిఖాగోయెల్ తెలిపారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి కేరళలో రూ.8.5 కోట్లకు పైగా అప్పుతో రెండు చారిటబుల్ ట్రస్ట్‌లను నిర్వహిస్తున్నాడు.
అతనికి ట్రేడింగ్‌పై అవగాహనతో 8918520578 నంబర్ నుంచి వాట్సాప్‌తో B6/Stock Visionaries ఇన్వెస్ట్మెంట్ గ్రూపులో జూన్ 8న యాడ్ చేయబడ్డాడు. అప్పటికే ఆ గ్రూప్‌లో కొందరు లాభాలు వస్తున్నాయని మెసేజ్‌లు చేస్తుండటంతో నిజమేనని నమ్మాడు. అనంతరం లిడియా శర్మ అనే మహిళ ‘గోల్డ్ మన్ సాక్స్’ అనే ఇండియా కంపెనీ ఐపీవోకు సిద్ధంగా ఉందని, దాంట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయిని మెసేజ్ చేసింది. స్పందించిన ఫిర్యాదుదారుడు.. ఆమెకు మెసేజ్ చేశాడు.
ఆమె సూచన మేరకు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించి జూలై 10న రూ.30వేలతో ప్రా రంభించి జూలై 25 నాటికి రూ.5,40,47,000 పెట్టాడు. వాటిని విత్‌డ్రా చేసుకునే ప్రయత్నంలో సైబర్ మోసగాళ్లు మరింత పెట్టాలని ఆదేశించడంతో.. మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చే శాడు. కేసులో కీలకంగా వ్యహరించిన రాం పిల్ల కొండల్రావు, చంద్రశేఖర్ ఆజాద్‌ను విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.