హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఒకటి కాదు.. రెండు కాదు.. దేశవ్యాప్తంగా 2,223 వివిధ సైబర్ నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు సెప్టెంబర్ చివరి వారంలో అరెస్టు చేశారు. వారిని మంగళవారం మీడియాముం దు ప్రవేశపెట్టారు. ఇతర రాష్ర్టాలకు వెళ్లి ఇంత భారీస్థాయిలో సైబర్ నేరస్థులను అరెస్టుచేసి పట్టుకురావటం ఇదే తొలిసారి అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో 27 మంది సైబర్ నేరగాళ్ల వివరాలు, వారిని అదుపులోకి తీసుకున్న విధానం, వారు కొల్లగొట్టిన డబ్బు తదితర విషయాలను వివరించారు. రాజస్థాన్‌లోని జైపూర్, జోధ్‌పూర్, నాగౌర్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు.. తెలంగాణలో 189 సైబర్ మోసాలకు పాల్పడినట్టు గుర్తించామని అన్నారు. వారి జాడ వెతుక్కుంటూ వెళ్లగా.. ఒక్కో నిందితుడు దేశవ్యాప్తంగా సుమారు 100కు పైగా సైబర్ నేరాల్లో నిందితుడిగా ఉన్నట్టు తెలుసుకున్నామని చెప్పారు. విశ్లేషించగా దేశవ్యాప్తంగా 2,223 కేసుల్లో వీరి పాత్రను గుర్తించామని వివరించారు. తెలంగాణ నుంచి 4 బృందాలుగా సైబర్‌క్రైమ్ పోలీసులు వెళ్లి.. వారి వాడిన ఫోన్స్, సిమ్కార్డ్స్, అడ్రస్‌లను విశ్లేషించి కొన్నిరోజులు రాజస్థాన్‌లోనే క్యాంపు వేసి 27 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఇదే సైబర్ నెట్‌వర్క్‌లో మరో 33 మంది నేరగాళ్లను గుర్తించామని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు.
29 మ్యూల్ ఖాతాల నుంచి..
ఆపరేషన్‌లో భాగంగా మొత్తం రూ.11,01,18,882 అనుమానాస్పద లావాదేవీలను 29 మ్యూల్ ఖాతాల ద్వారా నిర్వహించినట్టు గుర్తించామని శిఖాగోయల్ తెలిపారు. 27 మంది నిందితులను రాజస్థాన్‌లో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్లపై తెలంగాణలోని వివిధ జైళ్లకు తరలించామని వెల్లడించారు. వీరు సుమారు రూ.9 కోట్ల నగదు ఈ మ్యూల్ ఖాతాల నుంచి నిర్వహించారని చెప్పారు. ఈ రూ.11 కోట్ల సైబర్ నేరాల్లో అత్యధికంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్స్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టు, పార్ట్‌టైమ్ జాబ్ వంటి వివిధ మోసాలు ఉన్నట్టు వివరించారు. వారి వద్ద 31 మొబైల్ ఫోన్లు, 37 సిమ్ కార్డులు, 13 ఏటీఎం కార్డులు, 7 చెక్ బుక్‌లు, 2 బౌన్స్ చెకులు, 2 హార్డ్ డిస్లు, మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఒక్కో మ్యూల్ ఖాతాకు లావాదేవీని బట్టి సుమారు 50 వేలు పైనే ఉంటుందని చెప్పారు. వీళ్లు టార్గె ట్ చేసిన బాధితుల్లో 25-45 ఏండ్లవారు అధికంగా ఉన్నారని చెప్పారు. నేరస్థులంతా కంబోడియా, వియ త్నాం, మయన్మార్ తరహా సైబర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్కరికి రెండు వారాల పాటు శిక్షణ ఇస్తున్నట్టు గుర్తించామని అన్నారు.
బ్యాంకు అధికారుల పాత్రపై ఆరా
ఈ మ్యూల్ ఖాతాలను తెరవడం, నిర్వహించడంలో కొందరు బ్యాంక్ అధికారులు కీలక పాత్ర పోషించినట్టు గుర్తించామని శిఖాగోయల్ తెలిపారు. ఆ వివరాలను పరిశీలిస్తున్నామని, నేరం రుజువైతే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసుల్లో కింగ్పిన్ల పాత్రపైనా ఆరా తీస్తున్నామని అన్నారు. ‘కరెంట్ అకౌంట్ల’పై దృష్టి సారించామని తెలిపారు. పట్టుబడిన వారిలో కొందరు విద్యార్థు లు, వ్యాపారులు, నిరుద్యోగులు, ప్రైవే ట్ ఉద్యోగులు ఉన్నట్టు వెల్లడించారు. వీరు పార్ట్‌టైమ్‌గా కొన్ని పనులు చేస్తూ, ఫుల్‌టైమ్‌గా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించామని చెప్పా రు. రాజస్థాన్‌లో అహోరాత్రులు శ్రమించి, చాకచక్యంగా సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన సీఎస్బీ సిబ్బందిని శిఖాగోయల్ అభినందించారు. ఎస్పీ దేవేందర్‌సింగ్ ఆధ్వర్యంలో డీఎస్పీ కేవీ సూర్యప్రకాశ్, ఫణీందర్, వేణుగోపాల్‌రెడ్డి, హరికృష్ణ, కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్లు రమేశ్, ఆశిశ్రెడ్డి, రవికుమార్, శ్రీను, ఎస్సైలు రామునాయక్, సునీల్ నేతృత్వంలో ఆపరేషన్ విజయవంతం చేసిన సిబ్బందిని ప్రశంసించారు.