హైదరాబాద్, జనవరి 25 : తెలంగాణలో జరిగిన స్వాతంత్య్ర, సాయుధ పోరాట ఘట్టాలు, సంస్కృతి సంప్రదాయాల చిత్రాలు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నేడు (బుధవారం) కనువిందు చేయనున్నాయి. గణతంత్ర వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల నుంచి ఎంపికచేసిన 500 మంది కళాకారులు 750 మీటర్ల కాన్వాస్‌పై స్వాతంత్య్ర సమరయోధులు, ఆయా రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే పెయింటింగ్‌లు రాజ్‌పథ్‌లోని ఓపెన్ గ్యాలరీలో ప్రదర్శించారు. ఈసారి తెలంగాణ నుంచి కంది నర్సింహులు, జీ ప్రమోద్‌రెడ్డి, గుర్రం మల్లేశం, మహేశ్ పొట్టబత్తిని, నరేశ్‌కుమార్ పల్నాటి, అన్నారపు నరేందర్, జే వెంకటేశ్వర్లు, శివకుమార్ ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలో జరిగిన స్వాతంత్య్ర పోరాటం, సాయుధ పోరాటం, కవులు, కళాకారులు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు పెయింట్ చేశామని కళాకారుడు అన్నారపు నరేందర్ తెలిపారు. బతుకమ్మ, బోనాల చిత్రాలతో పాటు గోల్కొండ, చార్మినార్, చాకలి ఐలమ్మ, కుమ్రం భీం, కాళోజీ నారాయణరావు, దాశరధి కృష్ణమాచార్యుల చిత్రాలను ప్రదర్శించినట్టు ఆయన చెప్పారు.