పంట నష్టం.. 20,000 కోట్లు!
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. రైతులకు శాపం.. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నివేదిక.. పంటల సాగుపై శాటిలైట్ సర్వే
- సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
- 16 లక్షల ఎకరాల్లో వరి ఎండినట్టు అంచనా
- మరో 4-5 లక్షల ఎకరాల్లో పత్తికి తీవ్రనష్టం
- సాగునీరు అందక దిగుబడిపైనా ప్రభావం
- 50% తగ్గిన పత్తి, 20% తగ్గిన వరి దిగుబడి
- పత్తి ఎకరానికి ఐదు, వరి 20 క్వింటాళ్లే
- వచ్చే 20 రోజుల్లో పంటలకు నీరందకుంటే నష్టం రూ.30 వేల కోట్లకు చేరే ప్రమాదం
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో వానకాలం రైతులకు కష్టాలు, కన్నీళ్లనే మిగుల్చుతున్నది. నదుల నీళ్లన్నీ కండ్లముందే సముద్రంలో కలుస్తున్నా వాటిని ఎత్తిపోయకుండా, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపకుండా ప్రభుత్వం మొండికేయడంతో పంట పొలాలు నెర్రెలు బారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎండిపోయిన పంటలే వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 20-25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్టుగా వ్యవసాయ శాఖ అంచనా వేసినట్టు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు వర్షాభావ పరిస్థితులతో రైతులకు భారీ నష్టాలు తప్పడంలేదు. సాగునీరు లేక, అప్రకటిత విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. అవసరమైన నీరు అందకపోవడంతో పంట దిగుబడి తగ్గుతున్నది. ఈ ప్రభావంతో ఈ ఒక్క సీజన్లోనే రైతులకు భారీగా పంటనష్టం వాటిల్లుతున్నది. ఇప్పటి వరకు జరిగిన పంట నష్టం సుమారు రూ.20 వేల కోట్లు ఉంటుందని అంచనా. పరిస్థితి ఇలానే ఉంటే నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
నిరుటితో పోల్చితే ఈ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ముఖ్యంగా వరి సాగు భారీగా తగ్గింది. ప్రభుత్వం సీజన్ ముందు నుంచే వరి వేయొద్దని పిలుపునివ్వడంతో రైతులు దూరంగా ఉన్నారు. నిరుటితో పోల్చితే సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గడం గమనార్హం. వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం ఈ సీజన్లో 1.26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. వీటిలో 56.79 లక్షల ఎకరాల్లో వరి, 48.33 లక్షల ఎకరాల్లో పత్తి, 5.93 లక్షల ఎకరాల్లో మక్క, 5.58 లక్షల ఎకరాల్లో కంది సాగయ్యాయి. నిరుడు 1.33 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా ఇందులో వరి 67.33 లక్షల ఎకరాలు, పత్తి 46 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నిరుటితో పోల్చితే ఈ సీజన్లో మొత్తం సాగు 7.39 లక్షల ఎకరాలు తగ్గింది.
వరి 10 లక్షల ఎకరాలు తగ్గగా పత్తి మాత్రం 2.33 లక్షల ఎకరాల్లో పెరిగింది. ఇలా వరితో పాటు మొత్తం పంటల సాగు తగ్గించినా ప్రయోజనం లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు స్వయంగా కొంత మేర సాగు తగ్గిస్తే ఇప్పుడు కరెంట్, నీటి కరువుతో అదీ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కరువు నేపథ్యంలో పంటల పరిస్థితిపై ప్రభుత్వం, వ్యవసాయశాఖ నష్టం అంచనాలను సిద్ధం చేస్తున్నది. ఇప్పటి వరకు 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్టు లెక్క తేల్చినట్టుగా తెలిసింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై మూడు రోజుల క్రితం సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయనే స్వయంగా 13 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు తెలిపారు. కాది ఇది 16 లక్షల ఎకరాల వరకు ఉంటుందని వ్యవసాయశాఖ తేల్చింది. దీనికి తోడు మరో 4-5 లక్షల ఎకరాల్లో పత్తి పంట సైతం ఎండిపోయినట్టు తేల్చింది. ఇక మిగిలిన పంటలు కలిపి మరో 2 లక్షల ఎకరాల వరకు ఉంటుందని అంచనా వేసింది.
నష్టంపై వ్యవసాయ వర్సిటీ నివేదిక
సాగునీటి కొరత, కరెంట్ కోతలతో రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోవడం, పంటనష్టం, ఇతర పరిస్థితులపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ సర్వే నిర్వహించినట్టుగా తెలిసింది. శాటిలైట్ సర్వే ద్వారా లెక్కలు తీసి నివేదికను రూపొందిస్తున్నట్టు సమాచారం. మరో రెండు మూడో రోజుల్లో నివేదిక సిద్ధమవుతుందని, ఆ తర్వాత ఈ నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్టుగా తెలిసింది. ఈ సర్వే మేరకు రాష్ట్రంలో పంట నష్టం రూ.20 వేల కోట్లు ఉంటుందని వర్సిటీ వర్గాలు ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించాయి. మూడు, నాలుగు విధానాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు తెలిపాయి. వచ్చే నెల రోజులు కూడా పరిస్థితి ఇలానే ఉండి వరి, పత్తికి నీరందకపోతే మరో రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లినా ఆశ్చర్యపోనవసరం లేదని తేల్చిచెప్తున్నాయి.
నెల రోజులు కీలకం..
అత్యధికంగా వరి పంట పొట్ట దశలో ఉన్నది. పూర్తి పంట రావాలంటే మరో 20 రోజులు నీరందించాల్సి ఉంటుంది. పత్తి సైతం మొగ్గ దశలో ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకట్రెండు వర్షాలు పడితే పంట గట్టెక్కుతుందని రైతులు చెప్తున్నారు. లేదంటే పత్తి చేతికి రావడం కష్టమేననే ఆందోళన వారిలో నెలకొన్నది. ఈ నేపథ్యంలో వచ్చే 20-30 రోజులు అత్యంత కీలకమని చెప్తున్నారు. వరికి నీరందకుంటే మరో 5-10 లక్షల ఎకరాల్లో ఎండిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు తేల్చిచెప్తున్నారు. వర్షాలు పడకుంటే పత్తి చేతికి రాకుండా పోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఇప్పటికే పత్తి దిగుబడి 50 శాతం తగ్గిందని వివరించారు. సాధారణంగా ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 5 క్వింటాళ్లకు మించడంలేదని చెప్పారు. వరి 15-20 శాతం తగ్గినట్టు తెలిపారు. ఇప్పుడు నీరందకుంటే దిగుబడి 30-40 శాతం తగ్గడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

