రంగారెడ్డి / ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 2 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో కులోన్మాద హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పోలీసులు, రాయపోల్ గ్రామస్తుల కథనం ప్రకా రం.. రాయపోల్ గ్రామానికి చెందిన నాగలక్ష్మి (26) 2022 బ్యాచ్‌లో కానిస్టేబుల్, హయత్‌నగర్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తున్నది. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ను ఎనిమిదేండ్లుగా ప్రేమించి 15 రోజుల క్రితం కులాంతర వివాహం చేసుకుని హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నది. తాను వారిస్తున్నా వినకుండా ప్రేమ పెళ్లి చేసుకోవడంతో తమ్ముడు పరమేశ్ అక్కపై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం స్వగ్రామమైన రాయపోల్‌కు నాగలక్ష్మి వచ్చింది. సోమవారం నాగలక్ష్మి స్కూటీపై ఒంటరిగా పోలీసుస్టేషన్‌కు వెళ్తున్న విషయం తెలుసుకున్న పరమేశ్ కారులో వెంబడించాడు. రాయపోల్ నుంచి ఏండ్లగూడవైపు వెళ్తున్న రోడ్డులో ఆమె బైకును ఢీకొట్టాడు. కిందపడిపోయిన నాగలక్ష్మిని కత్తితో నరికి చంపాడు. అక్కడినుంచి ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలిసింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.